తానే ఒక ఫైర్ బ్రాండ్ అనుకుంటే.. తనకు మించిన వ్యూహాలతో వైసీపీ నేతలు వ్యవహరిస్తుండడంతో జబర్దస్త్ రోజా తల్లడిల్లుతున్నారనే వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని అనుకున్నారు రోజా. దూకుడు మామూలుగా పెంచలేదు. అయితే, స్థానికంగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి దూకుడుతో ఆమె వేగలేకపోతున్నారు. ఇటీవలే.. తనకు వ్యతిరేకించే వర్గానికి కార్పొరేషన్ పదవి ఇప్పించుకున్న పెద్దిరెడ్డి. తాజాగా తీసుకున్న నిర్ణయం మరింతగా రోజాకు కడుపు మండిస్తోందట.
కేజే కుమార్ సతీమణికి కార్పొరేషన్ పదవి ఇప్పించిన పెద్దిరెడ్డి.. ఇప్పుడు ఏకంగా.. నగరి నియోజకవర్గాన్ని తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ పరిధిలోకి మార్చారు. అంటే.. ఇకపై తిరుపతికి చెందిన అధికారులు.. తుడాలోని ప్రజా ప్రతినిధులు కూడా నగరిపై చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. ఇది రోజా దూకుడు అడ్డ కట్టవేస్తుందనే విశ్లేషణలు వస్తున్నాయి. వరుస విజయాలతో దూకుడు ప్రదర్శిస్తున్న రోజా.. తన నియోజకవర్గంపై గట్టి పట్టు పెంచుకున్నారు.
అయితే.. ఇప్పుడు నగరి నియోజకవర్గం తుడాలో కలుస్తున్నందన.. తాను తీసుకునే ఏ నిర్ణయానికైనా.. తుడాలో ఆమోదం లభించాలి. అంతేకాదు, తుడా తీసుకున్న నిర్ణయం ఏదైనా.. తనకు నచ్చకపోయినా.. అడ్డు చెప్పడానికి వీలు లేకుండా పోతుంది. మెజారిటీ సభ్యుల అంగీకారం మేరకు కార్యక్రమాలు జరిగిపోతాయి. ఈ పరిణామం రోజాను ఉక్కిరిబిక్కిరి గురి చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
పోనీ.. నగరిని తుడాలో కలపవద్దని అడ్డుకుంటే.. ఏకంగా నియోజకవర్గంలోని మేధావులు, విద్యావంతులు వ్యతిరేకించే అవకాశం ఉంది. తుడాలో కలపడం వల్ల రోడ్లు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి. దీంతో రోజాకు రెండు పక్కల ఇబ్బందిగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.
-vuyyuru subhash