ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. అయితే ఈ పర్యటనకు జగన్ హెలికాప్టర్ లో వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఎదురైనట్లు తెలిసింది. హెలికాప్టర్ అద్దం పగిలిపోవడం వల్ల పైలట్ జగన్ లేకుండా నేరుగా బెంగళూరుకు వెళ్లారు.
అయితే పాపిరెడ్డిపల్లికి జగన్ వచ్చాడని తెలుసుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయణ్ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ వారికి అభివాదం చేశారు. అయితే ఆ సమయంలో జగన్ హెలికాప్టర్ అద్దం పగిలి ఉంటుందని పైలట్ భావిస్తున్నారు. ఇక చాపర్ తో పైలట్ బెంగళూరుకు తిరిగి వెళ్లగా.. రోడ్డు మార్గంలో జగన్ బెంగళూరుకు వెళ్లనున్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన జగన్.. సీఎం చంద్రబాబు నాయుడు ఏపీని బిహార్ గా మారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఊడిగం చేసే వారికి శిక్ష తప్పదంటూ పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.