నల్లగొండ జిల్లాలో పర్యటించిన వైఎస్సార్‌టీసీ అధినేత్రి వైఎస్ షర్మిల విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు స్కూటర్ మీద తిరిగే జగదీశ్వర్ రెడ్డి కి వేల కోట్ల ఎలా వచ్చాయని ప్రశ్నించారు. లిక్కర్, ల్యాండ్ మాఫియా జగదీష్ రెడ్డి కి సంబంధాలు ఉన్నాయని, చెరువులను, ప్రభుత్వ భూములను మంత్రి ఆక్రమించాడన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి మీకు కనిపిస్తే చెప్పులతో, రాళ్లతో కొట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఓటు వేస్తున్నామో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని, బీరు, బిర్యాని కోసమో ఓట్లు వేస్తే ఇలాంటి నేతలే మనలని అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బును మనకు పంచి మంత్రులు అవుతారని ఆయన మండిపడ్డారు.
రెండుసార్లు నియోజకవర్గంలో గెలిపిస్తే మంత్రిగా నియోజకవర్గానికి ఏం చేశాడని, అభివృద్ధి చేయాలన్న సోయి మంత్రి జగదీష్ రెడ్డి కి లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకల ఫలితంగా 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, విద్యుత్ శాఖ మంత్రిగా కూడా మంత్రి ఘోరంగా విఫలమయ్యారని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం చెల్లించాల్సిన కోట్ల రూపాయలను ప్రజల చేత కట్టిస్తున్న ఘనుడు విద్యుత్ శాఖ మంత్రి అంటూ ఎద్దేవా చేశారు.