ఏఐసీసీ అగ్రనేతలను నిన్న ఢిల్లీలో కలిసిన వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలు, పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై చర్చించిన విషయం తెలిసిందే.అయితే విజయవాడలో రేపటి(బుధవారం) నుంచి మూడు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలపై కేడర్‌కు షర్మిల దిశానిర్దేశం చేస్తారు. అనంతరం రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్ర రత్న భవన్‌లో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, పలు కీలక అంశాలపై షర్మిల మాట్లాడుతారు. ఎల్లుండి నుంచి 2 రోజుల పాటు పార్లమెంట్ వారీగా ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులతో షర్మిల రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తారు.
ఈ నెల 20 వ తేదీన కడప, కర్నూల్, నంద్యాల, అనంతపురం, హిందూపూర్, నరసరావుపేట, బాపట్ల,నెల్లూర్, ఒంగోల్, గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, నర్సాపూరం,తిరుపతి, చిత్తూరు, రాజమండ్రి, రాజంపేట నాయకులతో సమావేశమై ఆయ జిల్లాల్లో పార్టీ పరిస్థితుల గురించి చర్చించనున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీని బలోపేతం దిశగా వైఎస్ షర్మిల పార్టీ శ్రేణులకు సలహాలు, సూచనలు ఇస్తారు. ఈ నెల 21న అరకు, శ్రీకాకుళం, కాకినాడ, అమలాపురం, విజయవాడ,విజయనగరం, అనకాపల్లి పార్లమెంటు వారీగా షర్మిల రివ్యూ నిర్వహిస్తారు. ఈ సమావేశాలకు జిల్లాల అధ్యక్షులు, కీలక నేతలు హాజరుకానున్నారు.