ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న విషయం తెలిసిందే. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ తో జైలు ఊచలు లెక్కపెట్టించడం మరియు టిడిపి-బిజెపి-జనసేన కలిసి 2014 ఎన్నికల్లో జగన్ ను చావుదెబ్బ కొట్టడం ఇప్పటికీ అతను మర్చిపోలేదు. అందుకే టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలను మరియు అవినీతిని బయట పెట్టేందుకు ఏకంగా ‘సిట్’ ను ఏర్పాటు చేశాడు.
సిట్ ను ఒక పోలీస్ స్టేషన్ గానే ప్రకటించేయడం మరియు ఎన్నడూలేని విధంగా వారికి అనేక అధికారాలు కట్టబెట్టడం చూస్తుంటే జగన్ ఎంత పట్టుదలతో ఉన్నాడన్న విషయం అర్థం అవుతోంది. అయితే ఇక్కడే జగన్ పప్పులో కాలేశాడు. 2014 ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిడిపి…. 2018 లో ప్రత్యేక హోదా విషయంలో వేరే గత్యంతరం లేక బిజెపి ని వ్యతిరేకించి ధర్మపోరాటం అనే పేరుతో చాలా పెద్ద రచ్చే చేసింది
అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి భారీ మెజార్టీతో మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావడం…. ఇక్కడ చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడటం మరియు ధర్మపోరాటం పేరుతో మోడీ, అమిత్ షా మరియు కేంద్రంలోని బీజేపీ పెద్దలను ఇష్టం వచ్చినట్లు విమర్శించడంతో బాబు కి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. అందుకే బహిరంగంగా తను బీజేపీ ని వదిలిపెట్టి తప్పు చేశానని చంద్రబాబు కూడా ఒప్పుకున్నాడు.
కానీ ఇప్పుడు జగన్ చేస్తున్న ఈ చర్యలతో సిట్ టీం ఒకే ఒక్క అవినీతిని బయటపెట్టినా చంద్రబాబుతో పాటు పార్టీలోని కీలక నేతలు కూడా జైలు పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి జగన్ చూపిస్తున్న ఈ దూకుడుతో మళ్ళీ టిడిపి…. మోడీ పార్టీ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం జనసేన తో చేతులు కలిపిన బిజెపి.. టిడిపితో తాము ఎట్టి పరిస్థితుల్లో కలిపేది లేదని తేల్చి చెప్పినా బాబు మాత్రం ఎలాగైనా మోడీ పార్టీకి దగ్గరకు చేరుకొని తనను తాను రక్షించుకోవాలని చాలా ఉబలాటంగా ఉన్నాడు. అదే కనుక జరిగితే జగన్ కు భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి.