తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన గుంటూరు జిల్లాకు చెందిన నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇవాల్టితో ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో ఆ పదవికి తిరిగి డొక్కా మాణిక్య వరప్రసాద్ నే ఎంపిక చేసింది అధికార వైసీపీ. టీడీపీ నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేయడంతో ఏర్పడిన స్థానాన్ని ఆయనతోనే భర్తీ చేయాలని నిర్ణయించారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 15న కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 18న నోటిఫికేషన్ వచ్చింది. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు. 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. ఈనెల 29 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. జూలై 6వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కిస్తారు. ఆ పదవికి ఎంపికయ్యే వారు 2023 మార్చి 29 వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు.