గల్లా జయదేవ్. టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు గుంటూరు ఎంపీగా విజయం సాధించారు. ఇదే జిల్లా నుంచి వైసీపీ తరఫున ఇద్దరు ఎంపీలు గెలుపు గుర్రం ఎక్కారు. వారే నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయులు, బాపట్ల నుంచి నందిగం సురేష్. అయితే, ఈ ఇద్దరి కంటే కూడా గల్లా దూకుడు ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. రాజధాని విషయంలో కానీ, మరేదైనా అంశంలో కానీ. దూకుడు ఎక్కువగానే చూపుతున్నారని జిల్లాలో టాక్. దీంతో గల్లా.. జిల్లాపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి పార్టీ ఓడిపోయినా.. ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. అన్ని విషయాల్లోనూ వేలు పెడుతున్నారు.
విచిత్రం ఏంటంటే పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏనాడూ జనాల్లో కనిపించని, గుంటూరు ప్రజలకు అందుబాటులో ఉండని జయదేవ్ పార్టీ చిత్తుగా ఓడిపోయాక మాత్రం అందుబాటులో ఉంటూ వస్తున్నారు. రాజధాని విషయంతో పాటు ప్రభుత్వ నిర్ణయాలపై స్పందిస్తున్నారు. ప్రతిపక్ష ఎంపీగా ఉన్న గల్లా చిన్న హడావిడి చేసినా ప్రచారం బాగా వస్తోంది. దీంతో ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు ఉండి కూడా ఏమీ జరగడం లేదనే టాక్ గుంటూరులో వినిపిస్తోంది. పైగా ఏడాది పూర్తయినా.. ఇప్పటి వరకు ఏమీ చేయలేదని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో గల్లాపై పైచేయి సాధించేందుకు కృష్ణదేవరాయులు, సురేష్‌లు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.
దీనిలో ప్రధానంగా పార్టీలో ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలను పక్కన పెట్టి.. అందరినీ కలుపుకొని పోయేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. గడిచిన రెండు రోజులుగా ఇద్దరు ఎంపీలు వారి వారి నియోజకవర్గాల్లో సమస్యలపై దృష్టి పెట్టారు. వైసీపీ నేతలను సమావేశ పరిచి.. వారి అసంతృప్తులను కూడా తెలుసుకుంటున్నారు. ఇక, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. వాస్తవానికి ఈ ఇద్ద రు కూడా గుంటూరులోనే ఉన్నా.. ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండడం లేదనే పేరుంది. దీంతో ఈ బ్యాడ్‌నేమ్‌ను తుడిచి పెట్టేందుకు ఇద్దరూ కూడా ప్రజలకు సమయం కేటాయించాలని నిర్ణయించుకు న్నారు.
ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం తోపాటు.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ది మంత్రం పఠిస్తున్నారు. అదే సమయంలో కృష్ణదేవరాయకులు స్థానిక సమస్యలనే కాకుండా రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో చర్చించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా నోట్ తయారు చేసుకున్నారు. అదేవిధంగా సురేష్ కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు రెడీ చేసుకున్నారు. ఇది గల్లాపై పైచేయి సాధించేందుకు తోడ్పడుతుందని వారు భావిస్తున్నారు. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.