Chat GPTపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సంచలన కామెంట్స్ చేశారు. చాట్ జీపీటీ వంటి ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు మనుషులను భర్తీ చేయలేవని స్పష్టం చేశారు. తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘సమాచార సేకరణకు, విషయ సముపార్జనకు చాట్‌జీపీటీ గొప్ప సాధనం. కానీ, కొన్ని విషయాల్లో అది మనుషులతో పోటీ పడలేదు. మనిషి మెదడును మించిన యంత్రం మరోటి లేదని నమ్మే వారిలో నేను ఒకణ్ని. కాబట్టి, చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్‌లు ఎప్పటికీ మనుషులను భర్తీ చేయలేవు’’ అని నారాయణ స్పష్టం చేశారు.
ఏఐ చాట్‌బాట్‌లు ఉద్యోగులను భర్తీ చేస్తాయన్న ఆందోళనల నేపథ్యంలో, ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోతారనే వాదనలు వెలువడిన నేపథ్యంలో మూర్తి వాటితో విభేదించారు. కొద్దిరోజుల క్రితం ఏఐ, చాట్‌జీపీటీలతో భవిష్యత్‌లో మానవాళి మనుగడకే ప్రమాదం తలెత్తవచ్చనే ఆందోళనతో వాటి అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని ఎలాన్ మస్క్ సహా పలువురు నిపుణులు ‘పాజ్ జియాంట్ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్’ పేరిట ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే.