ఐఏఎస్, ఐపీఎల్ లేదా ఐఎఫ్ఎఫ్ చదవాలనుకుంటున్నారా ? సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా ? కలెక్టర్ లేదా ఎస్పీ కావాలన్నదే మీ ఆశయమా ? అయితే సిద్ధం కండి. ఎందుకంటే.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2019 దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మార్చి 18వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 2019 జూన్ 2వ తేదీన ప్రిలిమినరీ పరీక్షలు ఉంటాయి. యూపీఎస్సీ అధికారిక సైట్ upsc.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఎవరైనా యూపీఎస్సీ సీఎస్ఈ 2019 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మూడు లెవల్స్‌లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మూడు లెవల్స్ లో క్వాలిఫై అయిన వారినే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. జూన్ 2వ తేదీన నిర్వహించనున్న యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో పాసైన వారికి సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 5 రోజుల వరకు మెయిన్స్ ఉంటాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 1వ తేదీన ఉంటాయి. ఐఎఫ్ఎస్ పరీక్షలు 10 రోజుల పాటు ఉంటాయి. మెయిన్స్‌లో పాసైన వారికి ఇంటర్వ్యూలు ఉంటాయి.
యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు (జనరల్ స్టడీస్ పేపర్-1, జనరల్ స్టడీస్ పేపర్-2) ఉంటాయి. ప్రతి పేపర్‌కు 200 మార్కులు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్, ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయి. మెయిన్ ఎగ్జామ్స్‌కు ప్రిలిమ్స్ క్వాలిఫికేషన్ పరీక్ష మాత్రమే ఉంటుంది. ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కులను ఫైనల్ ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకోరు. మెయిన్స్‌లో 1750 మార్కులు, ఇంటర్వ్యూల్లో 275 మార్కులుంటాయి. మెయిన్, ఇంటర్వ్యూ రౌండ్‌లలో మార్కులను బట్టి మెరిట్ స్కోర్ ఇస్తారు. దీంతో ర్యాంకులను నిర్ణయిస్తారు.