తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు ప్రజలకు గుడ్ న్యూస్ ను చెప్పారుకొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ నూతనంగా పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై హరీశ్ రావు నిప్పులు చెరిగారు. దేశంలో బీజీపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నంత అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ఉండి బురద రాజకీయం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సంపద పెంచి పేదలకు పంచుతుందన్నారు.
సంగారెడ్డిలో బస్తీ దవాఖానల ద్వారా మంచి వైద్యం అందుతుందని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు ప్రజల సుస్తీని పోగొట్టి, దోస్తీ దవాఖానగా మారాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఒకప్పటి లాగా లేవన్నారు. అవి పూర్తిగా మారిపోయాయన్నారు. పైసా ఖర్చు లేకుండా వైద్యం, పరీక్షలు, మందులు ప్రజలకు అందుతున్నాయన్నారు. బాలింతలకు కూడా తెలంగాణ సర్కార్ సాయంగా ఉందని అన్నారు.