సోషల్ మీడియా కేవలం ఎంటర్‌టైనమ్మెంట్ మాత్రమే కాదు.. ఆదాయ వనరు కూడా..! యూట్యూబ్ ద్వారా డబ్బులు కోట్లు సంపాదించిన వాళ్లూ ఉన్నారు. అయితే మీకు తెలుసా..? ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వాళ్లు మాత్రమే కాదు.. సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించే వాళ్లూ కూడా ట్యాక్స్ కట్టాలి..! యూట్యూబ్ వీడియోలు చేస్తూ రూ.కోట్లలో డబ్బులు సంపాదిస్తున్న ఒక క్రియేటర్‌కి తాజాగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ షాక్ ఇచ్చింది. యూట్యూబ్ ద్వారా సంపాదించిన ఆదాయంపై ట్యాక్స్ ఎగ్గొట్టాడనే ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకుంది.
స్మార్ట్‌ఫోన్ వాడేవారికి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ గురించి తప్పక తెలిసే ఉంటుంది. ఇంటర్నెట్ కాస్ట్ తగ్గిన తర్వాత దేశంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌తో పాటు వీడియో స్ట్రీమింగ్ పోర్టల్ యూట్యూబ్ యూజర్లు భారీగా పెరిగారు. ఈ ట్రెండ్‌తో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటూ యాడ్స్‌తో డబ్బు సంపాదిస్తున్నారు
బడ్జెట్‌లో ఇలాంటి మార్గాల్లో సంపాదించే ఆదాయాన్ని ప్రభుత్వం పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. పన్ను కట్టని ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఇటీవల ఐటీ దాడులు సైతం జరిగాయి. యూట్యూబ్ వీడియోలు చేస్తూ రూ.కోట్లలో డబ్బులు సంపాదిస్తున్న తస్లీమ్ అనే యూపీ కంటెంట్ క్రియేటర్‌కి తాజాగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ షాక్ ఇచ్చింది. ట్యాక్స్ ఎగ్గొట్టాడనే ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకుంది. తస్లీమ్ Trading Hub 3.0 యూట్యూబ్ ఛానల్‌లో షేర్ మార్కెట్ అనాలసిస్‌పై వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఏకంగా రూ.1కోటికి పైగా ఆదాయం సంపాదిస్తున్నాడు.
తన ఆదాయాన్ని ట్యాక్స్ రిట్నర్‌లో పేర్కొంటున్నట్లు అతడు చెబుతున్నారు. ఈ అంశాలపై ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక్కరే కాదు మిగతా క్రియేటర్స్ కూడా పన్ను చెల్లించాలని ఐటీ రూల్స్ చెబుతున్నాయి.
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో డబ్బు సంపాదించే అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లపై ఆదాయ పన్ను శాఖ దర్యాప్తు చేస్తోంది. సంపాదనకు అనుగుణంగా వీరు ఆదాయం, లాభాలను కచ్చితంగా ప్రకటించలేదని అధికారులు అనుమానిస్తున్నారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు స్పాన్సర్‌షిప్‌లు, ప్రొడక్ట్ ఎండార్స్‌మెంట్లు, యాడ్స్ రెవిన్యూ వంటి వివిధ వనరుల నుంచి ఆదాయం సంపాదించేవాళ్లు ఐటీ నిబంధనల ప్రకారం స్వయం ఉపాధి పొందిన వ్యక్తుల కిందకు వస్తారు. అందుకే ఇతర వ్యాపారాల మాదిరిగానే, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఆదాయంపై పన్నులు చెల్లించాలి.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ముఖ్యంగా ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జించే వారు, అదే స్థాయిలో డబ్బు సంపాదించే వ్యాపారులతో సమానంగా పన్ను కట్టాలి. పన్ను చెల్లింపు బాధ్యతల గురించి పూర్తిస్థాయిలో అవగాహన పొందేందుకు సంబంధిత ఫీల్డ్‌లో అనుభవం ఉన్న నిపుణులను సంప్రదించవచ్చు.