బియ్యం, అన్నం పట్ల మనలో ఉన్న సందేహాలివే..!

-

మన దేశంలో చాలా మందికి బియ్యంతో వండిన అన్నమే ప్రధాన ఆహారం. అనేక మంది అన్నమే ఎక్కువగా తింటారు. రక రకాల కూరలను చేసుకుని వాటిని అన్నంలో కలుపుకుని తింటుంటారు. అయితే అన్నం తినడం పట్ల, బియ్యం గురించి మనలో చాలా మందికి పలు అపోహలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బియ్యంలో గ్లూటెన్ ఉంటుంది ?
గ్లూటెన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. గోధుమలు, బార్లీ, ఓట్స్ తదితర ఆహారాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఆయా ధాన్యాలను పిండి చేసినప్పుడు వాటికి నీరు తగిలితే ఆ పిండి సాగినట్లు అవుతుంది. అందుకు వాటిలో ఉండే గ్లూటెన్ కారణం. అయితే గ్లూటెన్ తినడం మన శరీరానికి హానికరం అని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఇదే గ్లూటెన్ బియ్యంలోనూ ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ బియ్యంలో గ్లూటెన్ ఉండదు. కనుక బియ్యంతో అన్నం వండుకుని శుభ్రంగా తినవచ్చు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు.

2. అన్నం తినడం వల్ల శరీరంలో కొవ్వు చేరుతుంది ?
బియ్యంలో ఎలాంటి కొలెస్ట్రాల్, ఫ్యాట్స్ ఉండవు. అందువల్ల దాంతో వండే అన్నం తింటే శరీరంలో కొవ్వు చేరదు. నిత్యం మనం తినే జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్లే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. అంతేకానీ అన్నం తినడం వల్ల కొవ్వు చేరదు.

3. బియ్యంలో ప్రోటీన్లు ఉండవు ?
బియ్యంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్న మాట వాస్తవమే అయినప్పటికీ అందులో ప్రోటీన్లు ఉండవు అని అనుకోవడం పొరపాటు ఎందుకంటే బియ్యంలోనూ ప్రోటీన్లు ఉంటాయి. ఒక కప్పు బియ్యంలో 3 నుంచి 4 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీర నిర్మాణానికి పనికొస్తాయి.

4. బియ్యంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది ?
బియ్యంలో ఉప్పు ఎక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటుంటారు. అది నిజం కాదు. బియ్యంలో సోడియం ఉంటుంది. కానీ చాలా తక్కువగా ఉంటుంది. దాంతో కలిగే నష్టమేమీ ఉండదు.

5. రాత్రి పూట అన్నం తింటే కొవ్వు పెరుగుతుంది ?
రాత్రి పూట అన్నం తింటే కొవ్వు పెరుగుతుందని అనుకోవడం కూడా పొరపాటే. ఎందుకంటే అన్నం తినడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. దీంతో లెప్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మన శరీరంలో శక్తిని బాగా ఖర్చు చేస్తుంది. కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీంతోపాటు ఆకలి వేయకుండా ఉంచుతుంది. కనుక రాత్రి పూట నిర్భయంగా అన్నం తినవచ్చు.

6. అన్నం జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది ?
ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. నిజానికి అన్నమే చాలా సులభంగా జీర్ణమవుతుంది. గోధుమ పిండి, మైదా పిండితో చేసే రొట్టెలు, ఇతర ఆహారం జీర్ణమయ్యేందుకు సమయం పడుతుంది. దీంతో ఇవి కొందరిలో గ్యాస్‌ను కలగజేస్తాయి. ఆయుర్వేద ప్రకారం వాత, పిత్త, కఫాలనే త్రిదోషాలను సమతుల్యంలో ఉంచేందుకు అన్నం తినాలట. ఇది జీర్ణాశయాన్ని బలోపేతం చేస్తుందట.

7. వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైసే ఆరోగ్యకరం ?

పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల బ్రౌన్ రైస్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం అని అందరూ నమ్ముతున్నారు. ఇది నిజమే అయినప్పటికీ బ్రౌన్ రైస్‌లో అధికంగా ఉండే పీచు పదార్థం వల్ల శరీరం మన తినే ఆహారం నుంచి పలు పోషకాలను గ్రహించలేదు. ముఖ్యంగా జింక్‌ను శరీరం శోషించుకోదు. దీని వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిలో హెచ్చు తగ్గులు వస్తాయి. ఫలితంగా డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

8. మధుమేహం ఉన్న వారు అన్నం తినరాదు ?

సాధారణంగా మన దేశంలో చాలా మంది మధుమేహం ఉన్న వారు అన్నం తినడం మానేసి కేవలం చపాతీలను, జొన్న రొట్టెలను తింటుంటారు. అయితే నిజానికి మధుమేహం ఉన్న వారు నిర్భయంగా అన్నం తినవచ్చు. తక్కువ మోతాదులో అన్నం తినడంతోపాటు దాంట్లో పప్పులు, కూరగాయలు, నెయ్యి వంటి ఆహారాలను చేర్చుకుంటే భోజనం చేసిన వెంటనే షుగర్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇలా డయాబెటిస్ ఉన్నవారు కూడా అన్నం తింటూ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news