డ్రంకన్ డ్రైవ్.. ఇక మీదట నో వెహికిల్ సీజ్

పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తున్నారంటే మందుబాబులకు వెన్నులో వణుకు పుడుతుంది. పరిమితికి మించి మందు తాగినట్లు తేలితే ఇక అంతే సంగతులు. కోర్టు కేసు, జరిమానా, జైలు శిక్ష ఒక ఎత్తయితే వెహికిల్ సీజ్ మరో తలనొప్పి. వెహికిల్ సీజ్ కావడంతో నిట్టూర్చుకంటూ ఇంటికి వెళ్లాల్సిందే‌. కోర్టులో ఫైన్ కట్టి కౌన్సిలింగ్ పూర్తయితే గాని వాహనం చేతికి రాని పరిస్థితి. అయితే, ఇక మీదట డంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కోర్టులో ప్రాసిక్యూషన్ చేయవచ్చు గాని వెహికిల్ సీజ్ చేయడం మాత్రం కుదరదు. ఒకవేళ వెహికిల్ సీజ్ చేస్తే పోలీసులు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వెహికిల్ సీజ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో 43కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. మద్యం మత్తులో డ్రైవర్ వాహనం నడుపుతున్నా దాన్ని స్వాధీనం చేసుకునే అధికారం మోటారు వాహనం చట్టం కింద పోలీసులకు లేదని స్పష్టం చేశారు. ఒరిజినల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు గుర్తింపు కార్డు చూపిన వారికి వెహికిల్ ఇచ్చేయాలని తీర్పు ఇచ్చారు. వాహనం స్వాధీనానికి సంబంధించిన మార్గదర్శకాలను అమలు చేయకుంటే పోలీసులు కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు

– వెహికిల్ నడుపుతున్న వ్యక్తి మద్యం తాగినట్లు తేలితే అతని వెంట మద్యం తాగని మరో వ్యక్తి ఉండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాహనం సీజ్ చేయకుండా ఆ వ్యక్తి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలి.

– ఒకవేళ మద్యం తాగిన డ్రైవర్ వెంట ఎవరూ లేకపోతే అతని సంబంధీకులకు విషయం తెలపాలి.

– డ్రైవర్ సంబంధీకులు ఎవరూ రాకపోతే తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవాలి తప్పా సీజ్ చేయడానికి వీల్లేదు.

– డ్రైవర్, యజమానిని కూడా కోర్టులో ప్రాసిక్యూట్ చేయాలనుకుంటే మూడు రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది.