రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్ కు సంబంధించి కొత్త రూల్స్‌ను జారీ చేసింది. ఇక బ్యాంకు లాకర్ల సదుపాయం వినియోగించుకోవాలి అనుకుంటే మాత్రం కొన్ని నిబంధనలు తప్పక తెలుసుకోవాలి.
- ఈ కొత్త నిబంధన ప్రకారం ఇకపై దొంగతనం, అగ్నిప్రమాదం, భవనం కూలిపోవడం వంటి ఇతర మోసాల కారణాలతో లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే, వార్షిక లాకర్ అద్దెకు గరిష్టంగా 100 రెట్ల వరకే పరిహారం లభిస్తుంది. ఒకవేళ మీరు సంవత్సరానికి రూ. 500 చొప్పున లాకర్ చార్జీలు చెల్లిస్తారనుకోండి.. లాకర్‌లో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే గరిష్ట పరిహారం రూ. 50,000 మించకూడదు.
- దీనికి బ్యాంకుల బాధ్యతను ఆర్‌బీఐ పరిమితం చేసింది. లాకర్‌లలో చట్టవిరుద్ధమైనవి ఉంచకూడదు. ప్రకృతి విపత్తుల వల్ల లాకర్లకు నష్టం వాటిల్లితే ఆ బాధ్యత బ్యాంకులపై ఉండదు. ఈ సవరించిన నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంకులు అందిస్తున్న డిపాజిట్ లాకర్ ఆర్టికల్ సేవలను సమీక్షించిన తరువాత.. నిబంధనల్లో సవరణలు చేసినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. లాకర్లు ఖాళీగా లేకపోతే ప్రతీ దరఖాస్తును విధిగా స్వీకరించి వెయిటింగ్ లిస్ట్‌ను తయారు చేయాలని నిర్దేశించింది.
- లాకర్లు లేదా సేఫ్ డిపాజిట్ వాల్ట్‌ల భద్రత విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలా అని లాకర్‌లో ఉంచిన సొత్తుకు తమకు ఎలాంటి బాధ్యత లేదని బ్యాంకులు చెప్పడానికి వీల్లేదు. అగ్నిప్రమాదం, చోరీ, దోపిడీ, మోసం వల్ల కస్టమర్‌కు నష్టం వాటిల్లితే కిందటి సంవత్సరం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్ల వరకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది అని ఆర్‌బీఐ పేర్కొంది.
- టెక్నాలజీల సాయంతో చొరబాటుదారులు కస్టమర్ల ప్రమేయం లేకుండా లాకర్లను యాక్సెస్ చేసుకోగలరని.. ఇటువంటి సందర్భాల్లో వినియోగదారులు బ్యాంకుల దయపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది.