ఆనాటి చరిత్రకు ఆనవాలు కొండవీడు కోట.. ఆంధ్రా గోల్కొండగా ఫేమస్‌..!

-

ఆంధ్రాలో చారిత్రక కట్టడాలు చాలానే ఉన్నాయి.. ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేకత ఉంది.. కానీ అన్నీ అంత ప్రాచుర్యం పొందలేదు.. కొన్ని మాత్రమే అందరూ గుర్తించారు. గుంటూరు జిల్లా అంటే.. మిర్చి మాత్రమే ఫేమస్‌ అనుకుంటారు. ఆ ఘాటు అలా ఉంటుందనుకోండి. కానీ గుంటూరులో చారిత్రక ప్రదేశమైన..కొండవీడు కోట ఇప్పుడు మంచి పర్యాటక కేంద్రంగా డవలప్‌ అవుతుంది. ఈ కోట పై ఓ లుక్కేద్దామా..!

ఈ కొండవీడు కోట ప్రాచీన చరిత్ర, ప్రకృతి సంపదలకు నిలువెత్తు సాక్ష్యం. 1700 అడుగుల ఈ గిరిదుర్గం శత్రు దుర్భేద్యంగా ప్రఖ్యాతి గాంచింది. కోట నిర్మాణశైలి అద్భుతంగా ఉంటుంది. గిరి దుర్గం చుట్టూ ఉన్న ప్రాకారం పొడవు 20 కిలోమీటర్లు. ప్రతి కొండ శిఖరం నుంచి మరో కొండ శిఖరాన్ని తాకుతూ కొండవీడు కోటలోని అన్ని శిఖరాలను, మధ్యలో వచ్చే బురుజులను కలుపుతూ ఈ ప్రాకారం నిర్మించారు.. ప్రాకారం మధ్యలో అనేక నిర్మాణాలను రెడ్డిరాజులు అద్బుతంగా తీర్చిదిద్దారు… కొండలపైనే రాజు, రాణిల కోటలు, కారాగారం, వజ్రాగారం, ధాన్యాగారం, అశ్వ, గజ శాలలు, మందిరాలను ఏర్పాటు చేసుకున్నారు…

కోటలో మరింత ప్రత్యేకమైనవి ఇక్కడి బావులు… ఇంత ఎత్తైన కొండపై ఇంత లోతైన బావుల్ని ఎలా తవ్వించారన్నది నేటికి ఎవరూ చెప్పలేని రహస్యమే. . వీటి నుంచి నీళ్లు తోడేందుకు చాలా పొడవైన చాంతాళ్లు వాడేవారట. అందుకే ‘కొండవీటి చాంతాళ్లు’ అన్న నానుడి కూడా ఉంది.

కొండవీడు ప్రాంతంలో ఉన్న అపార శిల్ప సంపద నాటి అద్బుత కళలకు ప్రతీకలు. ఎక్కడ చూసినా రాతి శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు, విశిష్ట కట్టడాలు ఆకట్టుకుంటాయి. గ్రామాల్లో, పంట పొలాల్లో దేవతా, నంది విగ్రహాలు ఇప్పటికీ మనం చూడొచ్చు. కొండవీడు కొండలపై, దిగువన రెడ్డిరాజులు ఎన్నో ఆలయాలను నిర్మించారు.

కొండవీడు పరిసరాల్లో ఇప్పటికీ మరుగునపడిపోయి ఉన్న అనేక ఆనవాళ్ళు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. వాటిలో ఒకటే రెడ్డిరాజుల కాలం నాటి అతిపెద్ద దిగుడు బావి. 100 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, 35 అడుగుల లోతు కలిగి ఉన్న ఈ బావిని 14వ శతాబ్ధంలో రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు త్రాగునీటి అవసరాల కోసం వాడారని చరిత్ర చెబుతుంది.ఈ కొండల్లో నాగముష్టి, తిప్పతీగ, పాషాణభేదితోపాటు లెక్కలేనన్ని ఔషధమొక్కలున్నాయి. ఈ కొండమీదున్న వందల ఏళ్ల నాటి వెదురు చెట్లకు వెదురు బియ్యం పండుతోంది. పిల్లలకు విజ్ఞానంతో కూడిన విహార ప్రదేశం ఇది.

జరుగుతున్న అభివృద్ధి..

రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వం ‘నగరవనం’ కార్యక్రమంలో భాగంగా కోట పర్యాటకాభివృద్ధి వేగంగా జరుగుతోంది. కొండ దిగువ నుంచి కొండ మీదకు వెళ్లే ఆరు కిలోమీటర్ల ఘాట్‌రోడ్డును నిర్మించారు. ఆ దారితో పాటు కోట లోపల రెండున్నర కిలోమీటర్ల వాకింగ్‌ ట్రాక్‌లో నడక ప్రకృతితో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. రాశివనం, పంచవటి వంటి థీమ్‌ పార్కులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదేశం ట్రెక్కింగ్, హైకింగ్‌ చేయడానికి కూడా అనువుగా ఉండటం వల్ల నిత్యం ఇక్కడ పర్యాటకుల రద్దీ బానే ఉంటుంది.

టైమింగ్స్‌: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా ఎవ్వరైనా వెళ్లి చూడొచ్చు.
అడ్రస్‌: కొండవీడు, యడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ – 522549
ఫోన్‌ నెంబర్‌: +91 9885502778, శివారెడ్డి, కొండవీడు పరిరక్షణ సమితి. చరిత్ర కారుడు

ఎలా చేరుకోవాలి..?

కొండవీడుకోట గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం పరిధిలో ఉంది. ఈ కోటను చేరుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. చిలకలూరిపేట – గుంటూరు మధ్య జాతీయ రహదారి నెం.5 నుంచి బోయపాలెం మీదుగా వెళ్లొచ్చు.. గుంటూరు – నరసరావుపేట మార్గంలో ఫిరంగిపురం నుంచి కొండవీడు చేరేందుకు మరో మార్గం ఉంది. ప్రస్తుతం చిలకలూరిపేట నుంచి కొండవీడు మీదుగా ఫిరంగిపురంకు పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కొండవీడుకు ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లి మెట్లమార్గం ద్వారా కొండపైకి ఎక్కేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది.

కుదిరితే ఫ్రెండ్స్‌తో ఇలాంటి ప్లేసులకు వెళ్తే మస్త్‌ ఎంజాయ్‌ చేయొచ్చు..! దగ్గర్లో ఉంటే ఓసారి చూసిరండి.!

Read more RELATED
Recommended to you

Latest news