ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డాక్టర్ సుధాకర్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. నాలుగు రోజులుగా విశాఖలో విచారణ చేపట్టిన సీబీఐ.. నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ సిబ్బందితో పాటు సుధాకర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను, ఆయనకు వైద్యం చేసిన కింగ్ జార్జ్ ఆస్పత్రి అధికారులను, వైద్యులను ప్రశ్నించారు.
అయితే విశాఖ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎస్పీ విమలా ఆదిత్య మంగళవారం రాత్రి చెప్పారు. మంగళవారం రాత్రి సుధాకర్ మీద 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు.