రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విపక్షానికి చెందిన కీలక నాయకుడు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీకి పెద్దన్నగా పనులు చేస్తున్న మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చన్నాయుడిని ఏసీబీ అధికారులు ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు.. వివరాలు అన్నింటినీ కోర్టులోనే ప్రవేశ పెడతామని ఏసీబీ అధికారులు చెప్పారు. ఇదిలావుంటే, అచ్చన్న అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు మరింత ఆసక్తిగా మారాయి. సహజంగానే తమ నాయకుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు మీడియా ముందుకు రావడం నిప్పులు చిమ్మడం ఒకే..!
కానీ, అనూహ్యంగా టీడీపీపై పోరులో వైసీపీ నేతలు.. మరీ ముఖ్యంగా మంత్రులు భారీ ఎత్తున రెచ్చిపోవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇటీవల వైసీపీ వాళ్లు నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్న చందంగా మీడియా ముందుకు రావడం లేదు. ఓ వైపు ప్రభుత్వానికి కోర్టుల్లో మొట్టికాయలు పడుతున్నా… ప్రతిపక్షం నుంచి భారీ ఎత్తున కౌంటర్లు వస్తున్నా కూడా తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎవరో ఒకరో ఇద్దరో మంత్రులు మినహా మిగిలిన వారందరూ చాలా సైలెంట్‌గా.. ఏదైతే మాకేంటి అన్నట్టుగా ఉంటున్నారు.
ఇక అచ్చెన్న విషయంలో మాత్రం ఒక్కసారిగా వైసీపీ మంత్రులు అందరూ బయటకు వచ్చి మీడియా ముందు టీడీపీకి కౌంటర్లు వేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు మంత్రులు మీడియా ముందుకు రావడం.. చంద్రబాబుపైనా, అచ్చన్నాయుడిపైనా నిప్పులు చెరగడం వంటివి చూస్తే.. ఈ ఏడాది కాలంలో మంత్రులు ఇలా ఎప్పుడూ దూకుడు ప్రదర్శించిన సందర్భం మనకు కనిపించదు. ఈ విషయంపై హోం మంత్రి మేకతోటి సుచరిత.. ముందుగా స్పందించారు. సరే! ఆవిడ హోం మంత్రి, ఏసీబీ కూడా ఆమె చేతిలోనే ఉంటుంది కాబట్టి ఓకే అనుకోవచ్చు.
ఇక, కార్మిక శాఖ మంత్రి జయరాం కూడా దాదాపు గంట సేపు మీడియాతో మాట్లాడుతూ.. అచ్చన్నపై నిప్పులు చెరిగారు. బాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సరే.. ఈయన కూడా కార్మిక శాఖ మంత్రే కనుక.. సరిపెట్టుకోవచ్చు. కానీ, వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు.. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.. కూడా తెరమీదికి వచ్చి.. చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు, వెలంపల్లి మరో నాలుగు అడుగులు ముందుకేసి.. ఈఎస్ ఐలో కుంభకోణం జరిగిందని చెప్పిన చంద్రబాబు.. అవినీతి చేసిన వారిని మాత్రం అరెస్టు చేయకూడదని చెప్పడం సమంజసంగా లేదని దుయ్యబట్టారు. ఇదంతా చూస్తే.. వైసీపీలో మంత్రుల దూకుడు ఓ రేంజ్‌లో ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక మంత్రులు మాత్రమే కాదు మిగిలిన కీలక ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రోజా అయితే ఇది ట్రలర్ మాత్రమే సినిమా ముందు ఉందని విమర్శించారు. మొత్తంగా వైసీపీలో కొత్త వ్యూహం.. కొత్త దూకుడు కనిపిస్తుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.