జులై 10 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని కొన్ని రోజుల క్రితం ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. క్రితం 11 పరీక్షల పేపర్లు ఉండగా ప్రస్తుతం 6 పేపర్లకు బోర్డ్ కుదించింది. జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్, జులై 11న సెకండ్ లాంగ్వేజ్, జులై 12న థర్డ్ లాంగ్వేజ్, జులై 13న గణితం, జులై 14 సామాన్య శాస్త్రం, జులై 15న సాంఘీక శాస్త్రం పరీక్షలు జరగుతాయని తెలిపింది. అయితే ఏపీలో రోజు రోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం తీరుపై జనసేన, టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని.. టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
దీంతో పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడ్డుట్లు తెలుస్తోంది. కాగా, పదో తరగతి పరీక్షలపై ఇవాళ సాయంత్రంలోపు స్పష్టమైన ప్రకటన చేస్తామని విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం యథాతధంగా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నామని..దీనిపై సీఎం జగన్‌తోనూ చర్చించినట్లు ఆయన తెలిపారు. పరీక్షలు నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.