నైటీలు వేసుకుంటే జరిమానా వేయడమేంది.. అని అంటారా? అవును.. ఆ ఊళ్లో అంతే. ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లాలోని నిడమర్రు దగ్గర్లోని తోకలపల్లి అనే గ్రామంలోనే ఈ వింత రూల్ ఉంది. ఆ గ్రామానికి చెందిన యువతులు కానీ.. మహిళలు కానీ.. నైటీలు వేసుకోకూడదని నిషేధం విధించారు ఆ గ్రామ పెద్దలు. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు ఎవరూ నైటీ వేసుకొని ఊళ్లోకి రావద్దని కండీషన్ పెట్టారు. రాత్రి 7 దాటాక వేసుకోవచ్చు. ఆ ఊళ్లో గ్రామ పెద్దలదే మాట. వాళ్ల మాటే శాసనం. ఎక్కువగా వడ్డి కులస్థులు అక్కడ ఉంటారట. వాళ్లే గ్రామ పెద్దలట. దీంతో గ్రామ పెద్దలు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆ గ్రామ మహిళలు, యువతులు.
ఒకవేళ వాళ్లను కాదని ఎవరైనా నైటీ వేసుకుంటే.. వారికి 2 వేల రూపాయల జరిమానా విధిస్తున్నారట. ఎవరైనా నైటీ వేసుకున్న మహిళలను చూసి పెద్దలకు చెబితే వాళ్లకు వెయ్యి రూపాయల బహుమానం ప్రకటించారు. వామ్మో ఇదేం ఊరురా బాబోయ్.. అని అంటారా? ఆ ఊరు అంతే. మరి.. అధికారులను చెప్పొచ్చు కదా.. పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు కదా అని అంటారా? చేయరు.. ఎందుకంటే.. ఆ ఊళ్లో ఎప్పటి నుంచో గ్రామ పెద్దలే అధికారులు, గ్రామ పెద్దలే పోలీసులు. కాకపోతే ఈ విషయం అధికారులకు తెలిసిందట. దీంతో అధికారులు ఆ ఊరికి వచ్చి అసలు విషయం ఏంటో తెలుసుకున్నారట. కానీ.. దాని గురించి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారట. అలా ఉంటది అధికారుల పరిస్థితి.
ఆ ఊళ్లో మొత్తం 3600 మంది జనాభా ఉంటారట. ఇదే కాదు.. ఆ ఊళ్లో చాలా సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయట. వాటిని కూడా ఆ గ్రామ ప్రజలు పాటించాల్సిందేనట. వామ్మో.. ఇటువంటి ఊర్లో మీమైతే ఉండలేం బాబూ అంటారా? మీ ఇష్టం.