ఏపీ సీఎం జగన్‌కు రాష్ట్రంలోని 13 జిల్లాల కంటే నెల్లూరు జిల్లా నేతల మధ్య వార్ పెద్ద తలనొప్పి అయ్యింది. ఇక్కడ నేతల మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజకీయంగా తలపండిన వారే. పైగా ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగైదు సార్లు గెలిచిన వారే. జగన్ వీరందరిని కాదని జూనియర్ అయిన అనిల్‌కుమార్ యాదవ్‌కు మంత్రి పగ్గాలు ఇవ్వడంతో రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు వర్సెస్ అనిల్‌కు మధ్య ఎంత మాత్రం పొసగడం లేదు. చివరకు సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అనిల్‌ను టార్గెట్‌గా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఆనంకు మంత్రి పదవి రాలేదన్న కోపం ఉంది.
ఒక్క ఆనంకే కాదు కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి వీరంతా కూడా రెండు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. వీరు కూడా మంత్రి పదవి రేసులో ఉండడంతో నెల్లూరు వైసీపీ నేతల మధ్య ఏ మాత్రం సఖ్యత లేదు. దీంతో వీరిలో చాలా మందికి మంత్రి అనిల్‌కు పడడం లేదు. మంత్రి అనిల్ ఉన్నా ఆయన ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలోకి అడుగు పెట్టే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడ జగన్ నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు.
అందరూ సీనియర్ నేతలే కావడంతో కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందన్న నివేదికలు జగన్‌కు వెళ్లడంతో జగన్ చివరకు నెల్లూరు జిల్లాలో నేతల పంచాయితీని సరిచేసే బాధ్యతను అదే జిల్లాకు చెందిన మరో మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి అప్పగించారు. అదే జిల్లాకు చెందిన మంత్రికే జగన్ ఈ సమస్య అప్పగించడం పెద్ద డేరింగ్ స్టెప్పే అనుకోవాలి. గౌతంరెడ్డికి ఏ ఒక్కరితోనూ గ్యాప్ లేదు. తన పని తాను చేసుకుపోతుంటారు. ఆయన్ను అందరూ అభిమానిస్తారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండడం ఆయన నైజం. ఇప్పటికే గౌతంరెడ్డి జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలతో మాట్లాడి వీరిని ఓ రోజు కూర్చోపెట్టి వారి సమస్యలు విననున్నారు.
జిల్లాలో అందరూ సీనియర్ నేతలే కావడంతో ఇక్కడ నేతల మధ్య గొడవలు పరిష్కరించడం గౌతమ్‌కు కత్తిమీద సామే అయినా.. గౌతమ్ రెడ్డి తప్పా ఏ నేత చెప్పినా వినే పరిస్థితుల్లో కూడా వీరెవ్వరు లేరు. అందుకే జగన్ సైతం ఈ బాధ్యతలు ఈ యంగ్ డైనమిక్ ట్రబుల్ షూటర్‌కే అప్పగించారని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మరి జగన్ అప్పగించిన ఈ పంచాయితీని గౌతమ్ రెడ్డి ఎంత వరకు సక్సెస్ చేస్తారో ? చూడాలి.
-vuyyuru subhash