పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లో ధీమా ఎక్కడా తగ్గడం లేదు. తప్పనిసరిగా మళ్లీ ఎన్నికలు అంటూ వస్తే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి కే భయాందోళనలో ఉన్న టిడిపి క్యాడర్ ఎక్కడ తనకు దూరమవుతుంది అనే టెన్షన్ కూడా బాబులో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే పదే పదే వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందని, ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని, మళ్ళి ముందస్తు ఎన్నికలు వచ్చినా, ఎన్నికలు వచ్చినా ఆ పార్టీ ఓటమి చెందుతుంది అంటూ చంద్రబాబు చెబుతున్నారు. వైసిపి ప్రభుత్వం 15 నెలల కాలంలో ఎన్నో తప్పులు చేసిందని, లక్ష కోట్ల అప్పులు చేసిందని ఇప్పుడు బాబు గుర్తు చేస్తున్నారు.
నగదు బదిలీ పథకం రైతులకు ఉరితాడుగా మారుతోందని, రాయలసీమలోని ఇతర మెట్ట ప్రాంతాల్లో రైతుల కోసం బోర్లు వేస్తున్నారని, ఉచిత విద్యుత్ లేకుండా బోర్లు వేస్తే ప్రయోజనం ఏంటని, ఉచిత విద్యుత్ సబ్సిడీని నగదు బదిలీ చేస్తే కౌలు రైతుల పరిస్థితి ఏంటి అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తాజాగా అమరావతి లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాబు వ్యాఖ్యల పై సర్వత్రా ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టిడిపి ప్రభుత్వంలో ఎవరికి ఏ మేలు చేయకుండా చంద్రబాబు మాటలతో దాడి చేశారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలోనే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రంలో చేయని విధంగా పరిపాలన చేసి ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసి డైనమిక్ ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారని, బాబు హయాంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా పరిపాలన చేశారని, ఆయన పాలనకు విసుగు చెంది ప్రజలు ఇంత దారుణమైన ఓటమిని ఆయనకు కట్టబెట్టారని, ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు చంద్రబాబుకు ఎదురవుతున్నాయి.
ఒకవేళ బాబు చెప్పినట్లుగా వైసీపీ ప్రభుత్వానికి ఓటమే ఎదురవుతున్నది అనుకుంటే, మరి టిడిపి విజయం సాధిస్తుందా ?అసలు ఆ పార్టీ ఎన్నికలు వచ్చే వరకు యాక్టివ్ గా ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులు ఇతర పార్టీల వైపు వెళ్లిపోగా, మరి కొందరు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు మళ్లీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తమదే విజయమని అంటూ మాట్లాడుతున్న తీరు విడ్డూరంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
-Surya