అనంతలో ఊసురుమన్న తెలుగు తమ్ముళ్లు..కారణం ఇదే…!

-

అనంతపురం జిల్లా మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. సాధారణ వ్యక్తులకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఈ జిల్లాలో అవకాశం వచ్చింది. ఇక్కడ టీడీపీకి చెక్కు చెదరని ఓటు బ్యాంక్ ఉందంటారు. నాయకుడు ఎవరన్నది ఇక్కడ చూడకుండా, సైకిల్ గుర్తు, పసుపు జెండాకు పట్టంగట్టిన సందర్భాలున్నాయి.

కాని మొన్నటి ఎన్నికల్లో ఉన్నవాళ్లంతా చతికిలపడ్డారు. కొత్తవాళ్లొస్తే ఏదైనా మార్పువస్తుందనుకున్నారు. పైగా పార్టీ కష్టకాలంలో ఉంది. కొత్త రక్తంతో ఏమైనా ఊపొస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ, అనుకున్నదొకటి.. అయిందింకొకటి.. మళ్లీ పాతకాపులకే పట్టంకట్టారని దిగాలు పడ్డారు. అనంత తెలుగు తమ్ముళ్లు.

కొత్తగా పార్లమెంట్ ఇన్ చార్జ్ లను నియమించింది టిడిపి అధిష్టానం. అయితే అనంతపురం జిల్లాలో ఈ పదవులకు నియమించిన వారిపై అసంతృప్తులు పెరుగుతున్నాయి. హిందూపురం పార్లమెంట్ ఇన్ ఛార్జిగా బికే పార్థసారధి, అనంతపురం పార్లమెంట్ ఇన్ ఛార్జిగా కాలువ శ్రీనివాసులను నియమించారు. అయితే పార్టీశ్రేణుల్లో దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో టిడిపి పార్లమెంట్ ఇన్ ఛార్జులను నియమించింది. ఈ సారి కచ్చితంగా కొత్త వారికి అవకాశం ఇచ్చి పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకొస్తారని భావించారు. కానీ, మళ్లీ పాత కాపులకే పట్టం కట్టారు. నిన్నటి వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పార్థసారధి ఉన్నారు. మళ్లీ ఆయనకే హిందూపురం బాధ్యతలు అప్పజెప్పారు. ఇక పోలిట్ బ్యూరో సభ్యులుగా కాలువ శ్రీనివాసులుకు అనంతపురం బాధ్యతలు అప్పజెప్పారు. పార్టీలో ఇద్దరు సీనియర్లే.. వీరిపై వ్యక్తిగతంగా ఎవరికీ ఇబ్బంది లేదు. కాని కొత్త వారికి ఇచ్చి ఉంటే…పార్టీలో మార్పు కనిపించేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news