ఇటీవలే విజయవాడలో ప్రేమోన్మాది రెచ్చిపోయి ఇంజనీరింగ్ విద్యార్థి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రోజురోజుకు మహిళలపై దాడులు అత్యాచార ఘటనలు పెరిగిపోతుండటం దురదృష్టకరం అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం గురించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ . రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడానికి తీసుకొచ్చిన దిశ చట్టం రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏం సాధించింది అంటూ ప్రశ్నించారు.
అసలు ఆడపిల్లలకు రక్షణ కల్పించని చట్టాలు ఉండి ప్రయోజనం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక దిశా చట్టం తీసుకొచ్చింది కేవలం ప్రభుత్వ ప్రచారం కోసమే నా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు పవన్ . అత్యాచార కేసులు మహిళలపై దాడుల కేసుల్లో పోలీస్ శాఖ స్పందన సక్రమంగా లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. దిశ చట్టం రాష్ట్రంలో ఎంతో పటిష్టంగా అమలు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. అప్పుడే ప్రజలకు ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాల పై నమ్మకం కలుగుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.