హ‌మ్మ‌య్య జ‌గ‌న్ ప‌వ‌న్‌కు లైఫ్ ఇచ్చాడుగా..!

-

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ వ‌ర్గాల్లో తీవ్రమైన గూబులు రేపింది అన్నది వాస్తవం. జగన్ ఢిల్లీ పర్యటన వైసిపి ఎన్డీయేలో చేరే అంశంపై చర్చించేందుకేనంటూ వెలువ‌డ్డ‌ వార్తలు జనసేన వర్గాలతో పాటు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లో తీవ్రమైన ఆందోళనకు కారణమ‌య్యాయి. వాస్తవానికి జగన్ ఏపీలో ఉన్న కీలక ప్రాజెక్టులు, పెండింగ్ హామీలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి చర్చించేందుకు అని వైసిపి వర్గాలు ముందునుంచి చెబుతూ వస్తున్నాయి. అయితే ఎల్లో మీడియాతో పాటు.. కొందరు రాజకీయ మేధావులు ఈ అంశంపై వైసిపి ఎన్డీయేలో చేరే అంశంపై జగన్ – మోడీ చర్చలు జరుపుతారని.. వైసిపికి ఒక క్యాబినెట్, రెండు సహాయక మంత్రి పదవులు కూడా వస్తాయన్న ప్రచారం చేశారు.


ఒకవేళ వైసిపి ఎన్డీయేలో చేరితే ఏపీలో జనసేన పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయేది. జగన్ దగ్గర అయితే బీజేపీ ఖ‌చ్చితంగా జనసేన లైట్ తీసుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ ను పూర్తిగా పక్కన పెట్టేసేది. జగన్ ఢిల్లీ నుంచి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్ళినట్టు చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఊపిరిపీల్చుకున్నట్టు అయింది. ఈ క్రమంలోనే  ప‌వ‌న్‌ మాట్లాడుతూ బిజెపి.. వైసిపి కలిసి పని చేస్తే తప్పు లేదని, ఒకవేళ వైసిపి ఎన్డీయేలో చేరితే జనసేన ఎన్డీయే నుంచి బయటకు వస్తుందని చెప్పారు. అమరావతి కోసమే తాము బీజేపీతో కలిసి విషయాన్ని సైతం ప‌వ‌న్‌ స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఎన్డీయే ఉంచి శివసేన, శిరోమణి అకాలీ దళ్ ఇలాంటి నమ్మకమైన మిత్రులు బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో మద్దతుతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో బిజెపికి బ‌లంగా ఉన్న కొత్త ప్రాంతీయ మిత్రుల కోసం అన్వేషిస్తోంది. వైసీపీ లాంటి బలమైన మిత్రపక్షం మద్దతు తమకు ఉండాలని బీజేపీలోని కొందరు పెద్దలు కోరుకుంటున్నారు. ఈ రోజు కాకపోయినా వచ్చే ఎన్నికలకు ముందు ఎప్పుడైనా వైసీపీ.. బీజేపీ కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నట్టు జాతీయ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే అప్పుడైనా జనసేన, పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు కాక తప్పదు. ఏదేమైనా ప‌వ‌న్ ప్ర‌స్తుతానికి మాత్రమే కాస్త రిలీఫ్‌గా ఉన్నా ఎప్పుడైనా బీజేపీ షాక్ ఇచ్చేందుకు సిద్ధంగానే ఉంద‌ని చెప్పాలి.

 

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news