గ్రేటర్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి కాంగ్రెస్ కమిటీ భేటీ అయింది. ఉత్తమ్, రేవంత్, జానారెడ్డి, సంపత్‌తో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ భేటీ అయ్యారు. గ్రేటర్ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చిస్తున్నారు. కోర్ కమిటీ భేటీ అనంతరం గ్రేటర్‌లోని డివిజన్‌ల వారీగా పార్టీ నాయకులతో భేటీ అవుతారు ఠాగూర్.
ఇంచార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న సమయంలోనే ప్రతి 15 రోజులకు కోర్ కమటీ సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు మాణిక్ ఠాగూర్.గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం… ఎలాంటి ఎజెండాను సిద్ధం చేయాలనే దానిపై కోర్ కమిటీలో చర్చ జరగనుంది. ఇప్పటికే డివిజన్ల వారీగా పార్టీ కమిటీలను నియమించే పనిలో ఉన్నారు పార్టీ పెద్దలు. ఇక ఏఐసీసీ ఇచ్చిన కార్యచరణ అమలుపై కూడా కసరత్తు చేయబోతుంది. దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ సరళిపై పార్టీకి ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చింది. దుబ్బాకలో పొరపాట్లపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.