కేబినెట్‌ బెర్త్ ఆశిస్తున్న ఆ ఎమ్మెల్యే పై వైసీపీలో ఆసక్తికర చర్చ

-

రాజకీయాల్లో అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో తెలియదు. ఎన్నో అనుకుంటారు. ఏవేవో ఆశిస్తారు. పెద్దోళ్లకు ఎంతో దగ్గర అని లెక్కలు వేసుకుంటారు. కానీ చివరి నిమిషంలో ఇవేమీ వర్కవుట్‌ కావు. కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ విషయంలోనూ ఇదే జరిగిందని రాజకీయ వర్గాల్లో వినిపించే టాక్‌. రెండున్నరేళ్ల తర్వాత జరిగే మార్పులు చేర్పులపై కన్నేసిన పెడన ఎమ్మెల్యే అందరికంటే ముందే కర్చీఫ్‌ వేశాడు…

YS హయాంలో తొలిసారి పెడన నుంచి ఎమ్మెల్యే అయిన జోగి రమేష్‌.. 2014లో ప్రయోగాలకు పోయి ఇబ్బంది పడ్డారు. ఆ ఎన్నికల్లో మైలవరంలో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో తిరిగి పెడన చేరుకుని మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో బీసీ కోటా కింది తప్పకుండా మంత్రి అవుతానని అనుకున్నారట. సామాజిక సమీకరణాల్లో భాగంగా కృష్ణా జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినా.. ఆ జాబితాలో జోగి లేరు.

ఆ మధ్య మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన స్థానాల్లో అవకాశం ఇస్తారని.. సీఎం జగన్‌ పిలుస్తారని వేయి కళ్లతో ఎదురు చూశారట జోగి రమేష్‌. పైగా జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నవారు ఓసీ సామాజికవర్గం కావడంతో తప్పకుండా బీసీ అయిన తనకు ఛాన్స్‌ ఉంటుందని ఆయన అనుకున్నారట. కానీ మళ్లీ నిరాశే ఎదురైంది. ఇప్పట్లో కేబినెట్‌లో మార్పులు కష్టమే. రెండున్నరేళ్ల తర్వాత సీఎం జగన్‌ చేపట్టే మార్పులు చేర్పులపైనే ఆశలు పెట్టుకున్నారట.

అయితే గతంలో రెండుసార్లు ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టేశారట. ప్రస్తుతం కృష్ణాజిల్లా వైసీపీ వర్గాల్లో జోగి రమేష్‌ చేస్తున్నంత హడావిడి మరెవ్వరూ చేయడం లేదట. గతంలోలా కాకుండా ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయాలన్నా.. బీసీల విషయం వచ్చినా… ముందుగా రియాక్ట్‌ అవుతున్నారట జోగి రమేష్‌. ఇదివరకటి కంటే ఎక్కువగా చంద్రబాబును, టీడీపీని టార్గెట్‌ చేస్తున్నారు. భారీ హోర్డింగ్‌లు పెట్టి స్వామి భక్తిని చాటుకుంటున్నారాయన.

మొత్తం మీద కూటి కోసం కోటి విద్యలన్నట్టు కేబినెట్‌లో బెర్త్‌ కోసం ఎమ్మెల్యే జోగి రమేష్‌ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంత వరకూ వర్కవుట్‌ అవుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news