పాలమూరులో ఎన్నికల సందడి అప్పుడే మొదలైందే

-

పాలమూరు జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. రేపో మాపో ఎన్నికలున్నాయన్నట్లు అక్కడి ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఎన్నికలకు ఎంతో దూరం లేదన్నట్లు ఓ నియోజక వర్గంలో సందడి మొదలైంది. ఎత్తుకు పై ఎత్తులతో అధికార, విపక్ష పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. హడవిడి చేరికలతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న ఈక్వేషన్లపై స్థానిక నాయకత్వం లెక్కలేసుకుంటోంది. దేవరకద్ర నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు పాలమూరు రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచింది.

పాలమూరుజిల్లా దేవరకద్రలో టీఆర్ఎస్ ఇప్పటికే అన్ని పార్టీల నేతల చేరికలతో ఫుల్ లోడ్ తో ఉంది.అయినా కారు నిండినా టాప్ పై కూర్చోబెట్టుకుంటాం అన్నట్లు కొత్తవారిని చేర్చుకుంటోంది టిఆర్ఎస్ . పాత , కొత్త నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి. అభివృద్ది కోసం కలిసొచ్చే వారందరికీ గులాబీ కండువాలు కప్పేస్తామంటున్నారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో ఓడిపోయి సైలెంట్ అయిన పవన్ కుమార్ యాదవ్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టారు.

బీజేపీలోకి వెళ్లాలనుకున్న ఆయన ప్రయత్నాన్ని కొందరు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు వేల మందితో హైదరాబాద్ బయలు దేరిన కావలి పవన్ కుమార్ జిల్లా సరిహద్దు నుంచే వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా భావించిన టిఆర్ఎస్ పవన్ కుమార్ యాదవ్ తో మంతనాలు జరిపి పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ ఎపిసోడ్ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇక ఇక్కడి హస్తం పార్టీలో ఇంచార్జ్ బాధ్యతలు దక్కించుకునే వారు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మధుసూదన్ రెడ్డి , ప్రదీప్ గౌడ్ లు తనకంటే తనకే నియోజక వర్గ భాద్యత దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఎవరికి వారు మండలాల వారీగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మొత్తం మీద దేవరకద్ర నియోజక వర్గంలో అప్పుడే ఎన్నికలొచ్చినట్లు పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకెన్ని మార్పులు చూడాలోనంటున్నారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Latest news