కొడాలి,దేవినేని సవాళ్ల పర్వం రెండు పార్టీల వైరంగా మారిందా

-

ఏపీలో వైసీపీ-టీడీపీ నేతల మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్ల పర్వం పతాక స్థాయికి చేరింది. మొన్నటి వరకు దేవుని ఎదుట ప్రమాణాల సీజన్‌ నడిస్తే.. ఇప్పుడు దమ్ముంటే టచ్‌ చేసి చూడు అంటూ డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. కృష్ణా జిల్లాలో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన రాజకీయం దాదాపు స్ట్రీట్‌ ఫైట్‌ వరకు వెళ్లింది. ఇద్దరు నేతల మధ్య జరిగిన సవాళ్ల పర్వం..సై అంటే సై అంటూ పోటా పోటీ ప్రదర్శనలు రెండు పార్టీల వైరంగా మారింది.

దేవినేని ఉమ ఇంటికెళ్లి బడితే పూజ చేస్తానంటూ మైలవరం నియోజకవర్గంలో జరిగిన సభలో మంత్రి కొడాలి నాని హాట్‌ కామెంట్లుచేశారు. నాని కామెంట్లు రెండు పక్షాల మధ్య రాజకీయం రోడ్డెక్కేలా చేసింది. కొడాలి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు దేవినేని ఉమ.. గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసనకు దిగుతానని.. దమ్ముంటే టచ్‌ చేయడంటూ సవాల్‌ విసిరారు. దీంతో దేవినేని ఉమ ఇళ్లు, గొల్లపూడి సెంటర్‌లోని టీడీపీ కార్యాలయం, ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద హైడ్రామా నడిచింది. చెప్పినట్టుగానే గుట్టు చప్పుడు కాకుండా.. నెత్తిన టోపీ, మాస్కు తగిలించుకుని గొల్లపూడి సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకోగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గొల్లపుడి ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు ఉమ చేరుకున్నారనే విషయం తెలియగానే వైసీపీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌, ఎంపీ నందిగం సురేష్‌లు ర్యాలీగా వచ్చారు. ఇంకోవైపు బెజవాడ నుంచి వల్లభనేని వంశీ గొల్లపూడి సెంటర్‌కు చేరుకున్నారు. దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు జంక్షన్‌లోనే మొహరించడంతో ఎప్పుడేం జరుగుతుందా.. అనే ఆందోళన వ్యక్తమైంది. రెండు పక్షాలకు అతి కష్టమ్మీద సర్దిచెప్పిన పోలీసులు.. ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో రెండు వర్గాలు ఎన్టీఆర్‌ విగ్రహానికి పోటా పోటీగా పాలాభిషేకాలు చేశాయి.

ఈ క్రమంలో ఇటు వైసీపీ నేతలు.. అటు టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగింది. దొంగలా వచ్చాడని.. చర్చకు సిద్దమా..అంటే రోడ్డెక్కారంటూ అధికార పార్టీ నేతలు మండిపడ్డారు. ఉమ ఇంటి వద్దనైనా తాము చర్చకు సిద్దమని ప్రకటించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్‌, వల్లభనేని వంశీలు దేవినేని ఉమ మీద ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మంత్రి కొడాలి నాని కూడా అదే రేంజ్‌లో మరోసారి విరుచుకుపడ్డారు. మరోవైపు దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు పమిడిముక్కల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

కృష్ణా జిల్లాలో మంత్రి-మాజీ మంత్రి వ్యవహరం ప్రస్తుతం హైడ్రామాకు తెర లేపినా.. ఇది మరింత ముదిరే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వాతావరణం చూస్తుంటే మాటల యుద్దం ఇక్కడితో ఆగే సూచనలు కన్పించడం లేదు. అయితే ఈ వ్యవహరం మాటలతోనే ఆగుతుందా..లేక చేతల వరకు వెళ్తుందా..అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news