బీజేపీతో సీఎం కేసీఆర్ ర‌హ‌స్య ఒప్పందం !

-

  • రాష్ట్ర అసెంబ్లీలో సాగు చ‌ట్టాల‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి
  • రైతు ఆందోళ‌న‌ల‌పై కేంద్ర కుట్ర పన్నింది
  • కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీః బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే కూట‌మితో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ర‌హ‌స్య ఒప్పందం చేసుకుందని రాష్ట్ర కాంగ్రెస్ నేత‌, మాల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా తొలి రోజు పార్ల‌మెంట్ ఉమ్మ‌డి స‌భ‌లో రాష్ట్రప‌తి ప్ర‌సంగాన్ని ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ బ‌హిష్క‌రించాయి. కానీ తెలంగాణ అధికార టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు మాత్రం ఆ ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రించ‌కుండా స‌భ‌కు హాజరయ్యారని అన్నారు.

న్యూఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, కేంద్రం తీసుకువ‌చ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిజంగా వ్యతిరేకిస్తున్నట్లయితే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు అధికార టీఆర్ ఎస్ పార్టీ అనుకూలంగా ఆమోదం తెలిపింద‌ని ఆరోపించారు.

అలాగే, రైతుల‌ను, ప్ర‌తిప‌క్ష‌ నేతలను లక్ష్యంగా చేసుకుని కాషాయ పార్టీ నేతలు రైతుల ర్యాలీని హింసాత్మకంగా మార్చారని ఆరోపించారు. రైతుల ఆందోళన‌ల‌పై చివ‌రికి కేంద్ర ప్రభుత్వం కూడా కుట్ర చేసిందని ఆరోపించారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ అరవింద్ తన నియోజకవర్గ రైతులను మోసం చేశారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news