పంచాయతీ పోరు వైసీపీ, టీడీపీ మధ్య ఉంటే కర్నూలు జిల్లాలోని నందుకొట్కూరులో మాత్రం వైసీపీలోని రెండు వర్గాల మధ్య నడుస్తుంది. నలుగురు మంత్రులు, పార్టీ జిల్లా ఇంఛార్జ్ సమక్షంలో జరిగిన ఈ సమావేశం ఆ రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లింది. రేషన్ వాహనాల సమ పంపిణీతో మొన్నె కొలిక్కి వచ్చిందనుకున్న వర్గపోరు పంచాయతీ పోరుతో మళ్లీ మొదటికొచ్చింది.
అక్కడ ఎమ్మెల్యే, పార్టీ ఇంఛార్జ్ ఇద్దరూ అధికారపార్టీకి చెందిన వారే. కానీ వారి మధ్య యవ్వారం ఉప్పు నిప్పుగా ఉంటుంది. ఎమ్మెల్యే ఆర్థర్, నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య నెలకొన్న వైరం తో ఒకరినొకరు దూషించుకుంటూ కుర్చీలు పైకెత్తి కొట్టుకునే వరకు వెళ్లారు.
పంచాయతీ ఎన్నికలపై మంత్రుల ముందే సమావేశంలోనే నేతలు ఆవేశాలకు పోయారు.
తాజా సమావేశానికి పార్టీ ఇంఛార్జ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. వీరి ఎదుటే బాహాబాహీకి దిగాయి ఆర్థర్, సిద్ధార్థరెడ్డి వర్గాలు. నందికొట్కూరు నియోజకవర్గంలో 77 పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థుల ఎంపిక ఇబ్బందుల్లో పడింది. రెండు వర్గాల వారూ ఎవరికి వారుగా అభ్యర్థులను బరిలో దించేందుకు సిద్ధం కావడంతో స్వపక్షంలోనే వేడి రాజుకుంది. ఇప్పుడు కొట్టుకునే వరకు వెళ్లడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.
ఎమ్మెల్యే ఆర్థర్, పార్టీ ఇంఛార్జ్ సిద్ధార్థరెడ్డి మధ్య సమన్వయం కుదర్చకపోతే వైసీపీ దెబ్బతినే అవకాశం ఉందని కేడర్ ఆందోళన చెందుతుందట. పార్టీ పెద్దలు చెప్పారు కాబట్టి పైకి సర్దుబాటు చేసుకున్నట్టు తలాడించి..తెర వెనక ఒకరిపై మరొకరు పోటీ పెట్టుకుంటే పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టేనని అనుకుంటున్నారు. ఆర్థర్, సిద్ధార్థరెడ్డి మధ్య పంచాయితీ ఈనాటిది కాదు. ఆర్థర్ ఎమ్మెల్యే అయిన నాటి నుంచి గొడవలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు పెత్తనం చేయాలన్నది రెండు వర్గాల మధ్య ఎప్పుడూ సమస్యే. ఆ తర్వాత కొంత సర్దుకున్నట్టు కనిపించినా.. నిప్పు మాత్రం ఆరలేదు.
ఇదే నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పంచాయతీ ఎన్నికపై మరో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి అని రెండు పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాలు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిల సొంత ఊళ్లు. ఇప్పటి వరకు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చెప్పిన వారే సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. ఇప్పుడు మాత్రం సిద్ధార్థరెడ్డి సవాల్ విసురుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కుమారుడే సిద్ధార్థరెడ్డి. అయినా ఇద్దరూ సై అంటే సై అంటున్నారు. తొలుత రెండు ఊళ్లూ ఇద్దరు పంచుకుంటారని అనుకున్నా.. రెండు పంచాయతీలలోనూ వైసీపీ జెండా ఎగరేయాలని చూస్తున్నారట సిద్ధార్థరెడ్డి. దీంతో నందికొట్కూరు వైసీపీ గొడవలతోపాటు.. ముచ్చుమర్రి పోరు సైతం ఆసక్తి రేకిస్తోంది.