భద్రాద్రి రామయ్య పై సీతకన్ను ఎందుకో

-

అక్కడా ఉంది రాముడే ఇక్కడా ఉంది రాముడే.. అక్కడి దేవుడికి మాత్రం నిధుల వెలువ. ఇక్కడి దేవుడిపై మాత్రం అంతులేని నిర్లక్ష్యం. ఫలితంగా అభివృద్ధికి నోచుకోక వెలవెలబోతోందీ భద్రాద్రి దివ్యక్షేత్రం. అయోధ్య రాముడు జన్మించిన స్థలం అయితే.. భద్రాచలంలోని గోదావరి పరివాహక ప్రాంతం…రాముడు నడియాడిన క్షేత్రం. రాముడి వనవాసం నుంచి సీతమ్మ పర్ణశాల వరకు అన్నీభద్రాచలం ప్రాంతంలోనే ఉన్నాయి. ఇంత గొప్ప క్షేత్రమైన భద్రాచలంపై… ప్రభుత్వాలు మాత్రం చిన్నచూపు చూస్తున్నాయి. అయోద్య రామాలయ విరాళల సేకరణ వేళ భద్రాద్రి రామయ్య పై చర్చ ప్రారంభమైంది.

భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ రాముల వారు సీతాలక్ష్మణ సమేతుడై చతుర్బుజుడుగా వెలిశారు. సీతమ్మ వారిని వామనాంకం మీద కూర్చోబెట్టుకుని, పక్కన లక్ష్మణుడితో దర్శనమిస్తారు. త్రేతాయుగం అయిపోయిన తరువాత భద్రుడు తపస్సు వల్ల.. స్వామివారు భద్రాచలంలో వెలిశారని పురాణాలు చెప్తున్నాయి. అంతే కాదు భద్రాచలంలో రాములవారి కళ్యాణం ఏ సమయంలో జరిగితే.. అదే సమయంలో దేశంలోని అన్ని ఆలయాల్లో కళ్యాణం జరగడం ఆనవాయితీ. భద్రాద్రి రాముడి కళ్యాణ సమయంలోనే అయోధ్యలో రాముడి గుడికి శంకుస్థాపన జరగడం కూడా భద్రాచల క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యత తెలుపుతుంది.

తాజాగా అయోధ్యలో రామాలయం కట్టేందుకు దేశవ్యాప్తంగా నిధుల సేకరణ జరపడం… తెలంగాణలో పార్టీల మధ్య వివాదంగా మారింది. బీజేపీ నేతలు అయోధ్య రామయ్య కోసం నిధుల సేకరణ పేరుతో అక్రమాలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం టీఆర్‌ఎస్‌-బీజేపీ నేతల మధ్య దాడులు, ప్రతిదాడులకు కూడా దారితీసింది. దీంతో రాజకీయం మొత్తం ఇప్పుడు భద్రాచలం వైపు మళ్లింది.

అయోధ్య రామాలయ నిర్మాణానికి చేస్తున్న నిధుల సేకరణ… వివాదాన్ని రాజేసింది. అక్కడ సరే… మరి ఇక్కడ భద్రాద్రి రాముడి బాగోగులు ఎందుకు పక్కనపెట్టేశారని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు తమ అజెండాలోకి చేర్చేసుకున్నాయ్‌. అయోద్యను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రామాలయ నిర్మాణం చేపడుతుంది. దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల నిధులను సేకరిస్తుంది. దీంతో భద్రాచలం అభివృద్ధి విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఉత్తరాది దేవాలయంపై ఉన్న మక్కువ… దక్షిణాదిలో ఉన్న భద్రాద్రి రాముడుపై ఎందుకు చూపడంలేదని ఇక్కడి రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ఉద్యమానికి సిద్దమవుతున్నాయి.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news