బాలకృష్ణ వ్యాఖ్యల పై టీడీపీలో ఆసక్తికర చర్చ

-

బోయపాటి సినిమా తర్వాత బాలకృష్ణ ఏం చేయబోతున్నారు..త్వరలో అసలు రాజకీయం ఏంటో నందమూరి నటసింహం చూపించబోతున్నారా టీడీపీ శ్రేణుల్లో దీనిపైనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఓ అభిమానితో బాలయ్య బాబు మాట్లాడిన ఫోన్ సంభాషణ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ టాపిగ్గా మారింది.

ఒకవైపే చూడు రెండో వైపు చూడకు.. లేదంటే మాడి మసైపోతావు. ఇది సింహ సినిమాలోని బాలయ్య బాబు ఫేమస్‌ డైలాగ్‌. ఇన్నాళ్లు రాజకీయాల్లో తనను ఒకవైపే చూశారని.. రెండో వైపు తానేంటో చూపిస్తానంటున్నాడు నందమూరి నటసింహం. గత ఆరున్నరేళ్లుగా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతూ… అటు సినిమాలు-ఇటు రాజకీయ పడవలపై ప్రయాణం సాగిస్తూ వస్తున్న బాలకృష్ణ.. ఇకపై ఫుల్‌ టైం పాలిటిక్స్‌ చేయబోతున్నానన్న ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

ప్రముఖ దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తర్వాత నా సత్తా ఏంటో చూపిస్తానని బాలయ్య కీలక ప్రకటన చేశారు. ఇక, దేనికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. జనం కోసం త్వరలోనే రోడ్డు మీదకు వచ్చేస్తానని ప్రకటించారు నందమూరి నటసింహం.

పంచాయతీ ఎన్నికల కోసం నెల్లూరు జిల్లా రుద్రకోటలో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదే సమయంలో బాలకృష్ణ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న బాలయ్య.. బోయపాటి సినిమా తర్వాత నేనేంటో చూపిస్తానన్నారు. ఇప్పుడీ ఫోన్‌ సంభాషణ హాట్‌ టాపిగ్గా మారింది.

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎవరూ భయపడవద్దని టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు బాలకృష్ణ సూచించారు. బాలయ్య ఫోన్ కాల్‌తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. త్వరలో రాజకీయాల్లోకి మరింత క్రియాశీలకం అవుతానన్న ఆయన ప్రకటనపై అంతా చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news