చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి రోజు అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొలి టెస్టులో విఫలం అయినప్పటికీ రెండో టెస్టులో అదిరిపోయే ప్రదర్శన చేశాడు.
మొత్తం 231 బంతులు ఆడిన రోహిత్ 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు. అజింక్యా రహానె 149 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (33 పరుగులు, 5 ఫోర్లు, 1 సిక్సర్), అక్షర్ పటేల్ (5 పరుగులు, 1 ఫోర్)లు కొనసాగుతున్నారు.
కాగా తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి డకౌట్ అయ్యాడు. 5 బంతులు ఆడిన కోహ్లి మొయిన్ అలీ బౌలింగ్‌లో పరుగులు ఏమీ చేయకుండానే బౌల్డ్ అయ్యాడు. అలీ వేసిన బంతిని ఆడబోయిన కోహ్లి ముందుకు రాగా బంతి అతనికి అందకుండా వెనక్కి వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన కోహ్లికి ఏం జరిగిందో అర్థం కాలేదు. అయితే థర్డ్ అంపైర్ రీప్లేలో కోహ్లి బౌల్డ్ అయినట్లు నిర్దారణ అయింది. దీంతో కోహ్లి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్, మొయిన్ అలీలకు చెరో 2 వికెట్లు దక్కగా, స్టోన్, రూట్‌లకు చెరొక వికెట్ దక్కింది.