టెలికాం వినియోగదారులకు సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పుడే డీఎన్‌డీని కూడా ప్రవేశపెట్టారు. అంటే డు నాట్ డిస్టర్బ్ అన్నమాట. కొత్తగా సిమ్ తీసుకున్న వారు డీఎన్‌డీని యాక్టివేట్ చేసుకుంటే మార్కెటింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపించకూడదు. ఈ మేరకు ఓ నంబర్‌ను, తరువాత ఓ వ్యవస్థను కూడా గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. అయితే ప్రస్తుతం డీఎన్‌డీలో యాక్టివ్ అయి ఉన్నప్పటికీ అనేక మంది వినియోగదారులకు అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అయితే కేంద్రం తీసుకురానున్న డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) అనే ప్రత్యేక నోడల్ ఏజెన్సీ వల్ల ఇకపై వినియోగదారులకు డీఎన్డీలో ఉన్నా కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు వస్తే.. వారు ఫిర్యాదు చేస్తే.. సదరు కాల్స్ చేసే కంపెనీలు, వ్యక్తులతోపాటు టెలికాం కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటారు. వారికి భారీ జరిమానాలు విధిస్తారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తాజా నిర్వహించిన ఓ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
ఇక ప్రస్తుతం మొబైల్ నంబర్లను ఉపయోగించి చాలా మంది చీటింగ్‌కు పాల్పడుతున్నారు. ప్రజల డబ్బును దోచేస్తున్నారు. అలాగే సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు టెలికాం కంపెనీలకు కఠినమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ టెలికాం కంపెనీలతో మాట్లాడారు. అలా చీటింగ్‌లకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో టెలికాం వినియోగదారులకు డీఎన్‌డీతోపాటు ఈ విషయంలోనూ త్వరలో ఊరట లభించనుంది.