పార్టీ అధికారంలో లేకపోతే పల్లెల్లో పట్టు సాధించలేరా..పార్టీ ఆవిర్భావం నుంచి సీనియర్ నేతలుగా ఉన్న కోనసీమ టీడీపీ నేతలకు పంచాయతీ ఫలితాలు గట్టి షాకిచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట సైతం పంచాయతీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పార్టీ పరిమితమైంది. పల్లెపోరులో పూర్ పెరఫార్మెన్స్‌తో టీడీపీలో చర్చకు కారణమయ్యారు.
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మినహా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి రూరల్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు పంచాయతీ ఎన్నికల పరీక్షలో ఢీలా పడ్డారు. ఎలాగూ నెగ్గలేం అని భావించారో ఏమో.. కొన్నిచోట్ల జనసేన మద్దతుదారులకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
పెద్దాపురం నియోజకవర్గంలో 41 సర్పంచ్ పదవుల్లో కేవలం ఆరే టీడీపీకి దక్కాయి. కొన్ని పంచాయతీలలో నామమాత్రంగా అయినా పోటీ ఇవ్వలేకపోయారట. చినరాజప్ప డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఇక్కడ ఆయన హవా నడిచేది. రెండేళ్లు తిరిగే సరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. కడియం మండలంలోని పది పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ మద్దతుదారులు మూడుచోట్లే గెలుపొందారు. ఎమ్మెల్యే విస్తృత ప్రచారం చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడం నిరాశ పరిచిందట.
మండపేటలో వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన వేగుళ్ల జోగేశ్వరరావు సైతం పంచాయతీ ఎన్నికల్లో పట్టు సాధించలేకపోయారు. మండపేటలోని 43 పంచాయతీల్లో కేవలం ఆరుచోట్లే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. రాజకీయాల్లో తలపండినా.. ఎందుకో ఈసారి వారి ఎన్నికల రణతంత్రం అంతగా ఫలించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అభ్యర్థులను నిలబెట్టలేక జనసేన మద్దతుదారులకు సపోర్టు చేశారన్న ప్రచారం స్థానిక టీడీపీ నేతలను విస్మయ పరిచిందట. పల్లెపోరులో చేతులు ఎత్తేశారా అని చెవులు కొరుక్కుంటున్నారు.
ఇదే సమయంలో ప్రత్తిపాడు, రాజానగరం నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ మద్దతుదారులు గట్టిఫైటే ఇవ్వడం పార్టీలో చర్చకు దారితీసింది. జిల్లాలోని మిగిలిన చోట్ల టీడీపీ పోటీయే ఇవ్వలేదు. స్థానిక సమీకరణాలు.. రాజకీయ కారణాలతో ఫైట్ చేసిన వారే సొంత డబ్బులు ఖర్చు చేశారట. అలాంటి పంచాయతీలలోనే టీడీపీ కాస్త మెరుగైన ఫలితాలు సాధించింది. మొత్తంమీద జిల్లాలో రెండు దశల్లో జరిగిన 613 పంచాయతీ సమరంలో టీడీపీకి 79 చోట్లే ఊరట లభించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు తరముకొస్తుండటంతో అక్కడెలా పోరాడతారో చూడాలంటున్నాయి పార్టీ శ్రేణులు.