అక్కడ ఎమ్మెల్యే అభ్యర్దులకు మించి ఖర్చు పెడుతున్న కార్పోరేటర్లు

-

ఎన్నికల్లో గెలుపోటములను పక్కన పెడితే.. అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడవుతున్న రోజులివి. పంచాయతీ ఎన్నికల్లోనే లక్షలు వదిలించుకున్న వారు ఎందరో. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలు రావడంతో లక్షలు కాదు కోటికి రెక్కలు వచ్చాయి. బెజవాడలో కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే ఎన్నికలకు మించి ఖర్చు పెడుతున్నారట… అభ్యర్థుల ఖర్చు ఇప్పటికే కోట్లు దాటేసిందని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.

అమరావతి, మూడు రాజధానుల అంశాలపై రాజకీయాలు హీట్‌మీద ఉన్న సమయంలో వచ్చిన బెజవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇదే సమయంలో సత్తా చాటేందుకు బీజేపీ, జనసేన కూటమి.. లెఫ్ట్‌ పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. దీంతో కార్పొరేటర్‌గా బరిలో దిగిన అభ్యర్థులకు గెలుపు వ్యూహాలు పెద్ద సవాల్‌గానే మారాయి. చేతికి ఎముకే లేదన్నట్టుగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోందట. డివిజన్లలో పార్టీలు.. అభ్యర్థులు పెడుతున్న ఖర్చును అసెంబ్లీ ఎన్నికలను మించుతున్నట్టు చర్చ జరుగుతోంది.

బెజవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 64 డివిజన్లు ఉన్నాయి. పోటీ రసవత్తరంగా.. ఉత్కంఠ భరితంగా ఉండటంతో ప్రతీ డివిజన్‌ను పార్టీలు కీలకంగా భావించాల్సిన పరిస్థితి. ప్రధాన పార్టీలకు బీజేపీ-జనసేన కూటమి చీల్చే ఓట్లపై బెంగ పట్టుకుందట. అందుకే ఓట్లు చీలకుండా .. ఓటర్లను ఒడిసిపట్టేందుకు ఖర్చుకు వెనకాడటం లేదు కొందరు అభ్యర్థులు. బీసెంట్‌ రోడ్డు డివిజన్‌కు సంబంధించిన ఓ అభ్యర్థి ఖర్చు ఇప్పటికే కోటి దాటేసిందని చెప్పుకొంటున్నారు. సీటు తెచ్చుకోవటానికే నానా ఇబ్బందులు పడిన సదరు అభ్యర్థి.. కరోనా సమయంలో కేడర్‌ను, ప్రజలను కాపు కాసేందుకు పెట్టిన ఖర్చు.. ఇప్పుడు చేస్తున్న ఖర్చు కలిపి కోట్లలో తేలిందట.

బస్టాండ్‌ ఎదురుగా ఉన్న కృష్ణలంకలో పోటీకి దిగిన ఓ అభ్యర్థి ఖర్చు సైతం అలాగే ఉందట.ఈయన కూడా కరోనా సమయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఇప్పుడు ఓటుకు రెండువేలకు పైనే ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. దీంతో ప్రత్యర్థి పార్టీల నేతలు, అభ్యర్థులు ఆయన ఖర్చుకు జడిసి చేతలు ఎత్తేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. వన్‌టౌన్‌లో ప్రధాన వ్యాపార కూడళ్లకు కేంద్రమైన రెండుచోట్ల రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఖర్చులో కోటి మార్క్‌ దాటేసినట్టు సమాచారం. గెలిస్తే ఏదో విధంగా సంపాదించుకోవచ్చు అని భావించి ఇక్కడ ఖర్చుకు వెనకాడటం లేదని చర్చ జరుగుతోంది.

రాజీవ్‌నగర్‌లో లిక్కర్‌ వ్యాపారం చేస్తోన్న వారిలో ఒకరు పోటీకి దిగారు. అసలే మద్యం వ్యాపారం.. డబ్బుకు.. లిక్కర్‌కు కొదవ ఉండదనే ఉద్దేశంతో అభ్యర్థి వెంట ఎప్పుడూ మంది మార్భలం దండిగానే ఉంటోందట. ఇక్కడ ప్రధాన పార్టీల నేతలు కోటి వరకు ఖర్చు పెట్టేందుకు ప్లాన్‌ వేసుకుంటున్నారట. ఈ క్రమంలో చేతి చమురు వదిలి ఖాతా ఖాళీ కావడంతో కొందరు అభ్యర్థులు అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

కృష్ణలంక రాణీగారితోటలోని రెండు డివిజన్లలో పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల ఖర్చు కోటి ఎప్పుడో క్రాస్‌ చేసిందట. . బెజవాడ వాతావరణం ఎండలకు వేడెక్కుతున్నట్టే ఎన్నికల ఖర్చు కూడా కొండలా పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news