తెలంగాణ కాంగ్రెస్‌లో పాలమూరు యుద్దం..రేవంత్ vs సంపత్

-

కాంగ్రెస్‌లో పాలమూరు యుద్ధం మొదలైంది. మొదటి నుంచి ఉన్న విభేదాలు ఇప్పుడు ఓపెన్‌ అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు. ఇద్దరూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారే. కాకపోతే ఇద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పాతగాయాలు గట్టిగానే సలుపుతున్నాయట. ఇదే ఎమ్మెల్సీ ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ పుట్టిస్తుంది.

గతంలో నల్లమలలో యురేనియం తవ్వకాల అంశంపై రేవంత్-సంపత్ మధ్య గొడవలు రేగాయి. పవన్‌ కల్యాణ్ ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్ అంశంపై మాటల తూటాలు పేల్చుకున్నారు. రేవంత్‌ కొంత కటువుగానే కామెంట్‌ చేసినా.. మా ముద్దుల అన్నయ్య అంటూనే సెటైర్లు వేశారు సంపత్‌. ఆ గొడవ కొన్నాళ్లపాటు సాగింది. తర్వాత అంతా మర్చిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో రేవంత్‌, సంపత్‌ మధ్య పాలమూరు యుద్ధం మళ్లీ స్టార్ట్‌ అయింది.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్‌లో సభ ఏర్పాటు చేశారు సంపత్‌. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్, పొన్నం ప్రభాకర్లను పిలిచారు. వస్తా అని రేవంత్‌ మాటివ్వడంతో కొంత ఘనంగానే సభా ఏర్పాట్లు చేశారట. అయితే నారాయణపేట్‌లో సభకు హాజరైన రేవంత్‌.. అలంపూర్‌, మక్తల్‌, గద్వాల సభలకు డుమ్మా కొట్టడంతో సంపత్‌కు చిర్రెత్తికొచ్చిందట. వర్కింగ్‌ ప్రెసిడెంట్లు ఇద్దరూ రాకపోవడంతో ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు కూడా. వేరెవరికో ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడానికే సభకు రాలేదని ఆ ఫిర్యాదులో ఆరోపించారట సంపత్‌. గతంలో ఉన్న గొడవల వల్లే సంతప్‌ సభకు రేవంత్‌ రాలేదన్నది ఇంకొందరి అనుమానం.

రేవంత్‌రెడ్డి ఆ మధ్య అచ్చంపేట నుంచి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ఒక్కరోజు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారట. ఇది రేవంత్‌ వర్గానికి రుచించలేదని సమాచారం. అదే జిల్లాకు చెందిన సంపత్‌ సైతం పాదయాత్రవైపు కన్నెత్తి చూడలేదట. కనీసం తన మనుషులను కూడా పంపలేదట. ఏఐసీసీలో పదవులు ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇలా అంటీముట్టనట్టు ఉండటం పార్టీలో చర్చకు కారణమైంది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న రేవంత్‌.. అలంపూర్ సభకు రాలేదని సంపత్‌ వర్గం భావిస్తోందట. ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నాయకులు పైకి నవ్వుతూ కనిపిస్తున్నా నొసటితో వెక్కిరించుకుంటున్నారు.. తెరవెనక కత్తులు దూసుకుంటున్నారు.

ఒకరు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాకపోయినా పర్వాలేదు కానీ.. రానున్న రోజుల్లో వీటిని మనసులో పెట్టుకుని కయ్యానికి కాలు దువ్వితే మాత్రం కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పవన్నది గాంధీభవన్‌ వర్గాల ఆందోళన. ఈ విషయాలు పార్టీ పెద్దలకు తెలియంది కాదు. కానీ.. సయోధ్యకు చొరవ తీసుకునేవారు లేరు. మరి..ఈ పాలమూరు యుద్ధం ఎటు నుంచి ఎటు మళ్లుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news