రాష్ట్రంలో పాలపొడిని పాలుగా మారుస్తున్న డెయిరీలు.. ఉత్పత్తి తగ్గడమే కారణమా…?

-

తెలంగాణ రాష్ట్రంలో పాల కొరత ఏర్పడుతోంది. ఎండ తీవ్రత పెరుగుతున్న కోణంలో పలు డెయిరీలు పాల పొడిని పాలుగా మార్చి.. ప్యాకెట్ల రూపంలో పాలను అమ్ముతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు డెయిరీలు 200 టన్నుల పాలపొడిని విక్రయించినట్లు సమాచారం. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగి పాల దిగుబడి తగ్గుతుందని విజయ డెయిరీ తెలిపింది.

పాలు
పాలు

ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతున్న పాల ఉత్పత్తి కేంద్రం విజయ డెయిరీ ప్రస్తుతం కర్ణాటక నుంచి 50 వేల లీటర్ల పాలను విక్రయిస్తోంది. సాధారణంగా ఈ డెయిరీకి రోజూ 3.80 లక్షల లీటర్ల పాలు అవసరం. అయితే రాష్ట్రంలో ప్రైవేటు డెయిరీలు రేట్లు పెంచి స్థానికంగా పాలు కొంటున్నాయి. ఈ డెయిరీలతో పోటీ పడలేక విజయ డెయిరీ కర్ణాటక పాలపైనే ఆధారపడింది. ఈ నెలలోనే ఉష్ణోగ్రతలు పెరగడంతో పాల దిగుబడి బాగా తగ్గినట్లు విజయ డెయిరీ వెల్లడించింది. దీంతో ఈ సంస్థ పాల సేకరణ ధరను లీటరుకు రూపాయి పెంచింది.

అయితే ప్రైవేటు డెయిరీ సంస్థలు రూ.4 నుంచి రూ.5 వరకూ ధరలు పెంచుకున్నారు. దీంతో రాష్ట్రంలో పాలను విక్రయించే అవకాశం విజయ డెయిరీకి లేకుండా పోయింది. అందుకే కర్ణాటక రాష్ట్రం నుంచి పాలను దిగుమతి చేసుకుంటోంది. అయితే రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎంత జరుగుతుంది.. అమ్మకాలు ఎంత జరుగుతున్నాయనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు. గతంలో పాల ఉత్పత్తి, అమ్మకాలపై రాష్ట్ర పాల కమిషనర్ (విజయ డెయిరీ ఎండీ) పూర్తి వివరాలను సేకరించేవారు. కమిషనర్ పోస్టును రద్దు చేయడంతో ఇప్పుడు ప్రైవేటు డెయిరీలు పాల ఉత్పత్తి, అమ్మకాల గురించి వివరాలు వెల్లడించడం లేదు.

కాగా, విజయ డెయిరీలో పాలకు గిట్టు బాటు ధర రావడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల విజయ డెయిరీ కేంద్రాలు మూతపడ్డాయి. కొరత నేపథ్యంలో ప్రైవేటు డెయిరీలు పాల ధరను బాగా పెంచాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి పాలను కొనడం వల్ల స్థానికంగా తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి మూతబడిన విజయ డెయిరీలను తెరవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news