హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎన్నికైన విషయం తెలిసింది. ఈ నేపథ్యలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్‌ను వదిలేదిలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు కూడా మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డే టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ కోసం కొండను తవ్వి ఎలుకను పట్టిందని విమర్శించారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఖైదీ నంబర్ 1799 అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ శకం ముగిసినట్టేనని ఎద్దేవా చేశారు. టీఆరెస్ ది క్యాట్ వాక్ కాదని, రేవంత్ రెడ్డిది జైల్ వాక్ అని విమర్శించారు. పదవులు వస్తే హుందాగా మాట్లాడాలన్నారు. సోనియాగాంధీ పై ఉన్న అభిప్రాయం కాస్తా రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంతో పోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే జైల్ పార్టీ అని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. బ్లాక్ మెయిల్‌కి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని జీవన్ రెడ్డి ఆరోపించారు.