ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ ఇప్పటికే బయటకు వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ covid vaccine రెండు డోసులను రెండు వేర్వేరు కంపెనీలకు చెందినవి తీసుకోవచ్చా ? తీసుకుంటే ఏమైనా జరుగుతుందా ? అని చర్చించుకుంటున్నారు. అయితే రెండు డోసులు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
జూన్ నెలలో ఇటలీ ప్రధాని మారియో డ్రాగి మొదటి డోసులో ఆస్ట్రా జెనెకా టీకాను తీసుకోగా, రెండో డోసును ఫైజర్ కంపెనీకి చెందినది తీసుకున్నారు. అలాగే జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మొదటి డోసు ఆస్ట్రా జెనెకా టీకాను తీసుకోగా రెండో డోసును మోడెర్నా టీకాను తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు సైంటిస్టులు ఇలా వేర్వేరు టీకాలను తీసుకున్న వారిపై అధ్యయనం జరిపారు. అయితే మొదటి డోసు ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న తరువాత రెండో డోసు ఫైజర్ టీకా తీసుకుంటే భారీ ఎత్తున యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతున్నాయని, అవి రెండు డోసుల ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న తరువాత ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీల కన్నా ఎక్కువేనని సైంటిస్టులు తేల్చారు. అందువల్ల రెండు డోసులు భిన్న వ్యాక్సిన్లను తీసుకుంటే మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.
ఇక మన దేశంలోనూ దీనిపై ఆసక్తికర చర్చ కొనసాగుతుండగా, యూపీలో ఇప్పటికే కొందరికి రెండు రకాల వ్యాక్సిన్లను రెండు డోసుల్లో ఇచ్చి ట్రయల్స్ చేపట్టారు. వారికి మొదటి డోసు కోవిషీల్డ్ ఇవ్వగా, రెండో డోసు కోవాగ్జిన్ ఇచ్చారు. ఇలా రెండు డోసులు భిన్న వ్యాక్సిన్లు ఇస్తే శరీరంలో అనేక చోట్ల ఉన్న రోగ నిరోధక వ్యవస్థ భిన్నంగా స్పందిస్తుందని, దీంతో వివిధ రకాలుగా దాడి చేసే వైరస్‌లను ఎదుర్కోవడం తేలికవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను రెండు డోసుల్లో వేసుకున్న వారిలో యాంటీ బాడీలు ఏవిధంగా ఉత్పత్తి అవుతాయో చూడాలి.