తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ విషయంలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ పని అయిపోయిందని, పార్టీని చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ పైకి తీసుకురాలేరని, కాబట్టి పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇస్తేనే బెటర్ అంటూ కొందరు ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అలాగే చంద్రబాబు, లోకేష్ సభల్లో సీఎం ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ కొందరు స్లోగన్లు ఇస్తున్నారు. అయితే ఇదంతా ప్రత్యర్ధులు ఆడిస్తున్న డ్రామా అని, టీడీపీని దెబ్బతీయడానికి ఇలా ఎన్టీఆర్‌ని, పార్టీని వేరు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని కొందరు తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు.
ఇదే సమయంలో ఎన్టీఆర్ పిఆర్‌ఓ మహేష్ కోనేరు నిర్మాతగా వచ్చిన తిమ్మరుసు చిత్రంలో లోకేష్‌ని పరోక్షంగా ట్రోల్ చేసే సీన్లు ఉన్నాయని కొందరు తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎన్టీఆర్ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ని టీడీపీ అభిమానులు బాయ్‌కాట్ చేయాలంటూ పలువురు టీడీపీ కార్యకర్తలు పిలుపునిస్తున్నారు.
ఇదే సమయంలో కొందరు సినిమాని బాయ్‌కాట్ చేయడం వల్ల ఎన్టీఆర్‌కు జరిగే నష్టమేమీ లేదంటూ, తారక్ అభిమానులు గట్టిగా చెబుతున్నారు. టీడీపీ బ్రతకాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే అని మాట్లాడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరు టీడీపీ అభిమానులు ఎన్టీఆర్‌ని గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. గతంలో అలాగే ఎన్టీఆర్ సినిమాలని చూడకూడదని టీడీపీ అభిమానులు మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
అప్పటిలో దమ్ము సినిమా విషయంలో ఇలాగే రచ్చ జరిగింది. అప్పుడు ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ని చూడకూడదంటూ మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా టీడీపీ, ఎన్టీఆర్‌కు కాస్త గ్యాప్ వచ్చినట్లే కనబడుతోంది. కానీ సినిమాలని, రాజకీయాలని వేరు వేరుగా చూడాలని విశ్లేషకులు అంటున్నారు.