గెల్లుకు మంత్రి అయ్యే ఛాన్స్ ఉందా?

-

హుజూరాబాద్ ఉపపోరులో టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ అధిష్టానం గెల్లు పేరుని అధికారికంగా ప్రకటించింది. విద్యార్ధి దశ నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన శ్రీనివాస్ అయితేనే ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టగలరని కేసీఆర్ భావించారు. ఇక అభ్యర్ధిని ప్రకటించిందే తరువాయి. మంత్రి హరీష్ రావు, గెల్లుని వెంటబెట్టుకుని హుజూరాబాద్ బరిలో దిగేశారు.

అక్కడ భారీ ఎత్తున సభ పెట్టి టీఆర్ఎస్ ఏం చేయబోతుందో చెబుతూనే, ఈటలపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రిగా ఉండగానే ఈటల, హుజూరాబాద్‌కు ఏం చేయలేదని, ఇక ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తారని అన్నారు. మరో రెండున్నర ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని, ప్రజలు గెల్లుని గెలిపించాలని కోరారు. అయితే ఈటలకు చెక్ పెట్టడానికి టీఆర్ఎస్ ఎన్ని రకాల వ్యూహాలు వేయాలో అన్నీ రకాల వ్యూహాలు వేస్తుంది.

తన అధికార బలాన్ని అన్నీ రకాలుగా ఉపయోగిస్తుంది. ఇప్పటికే అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరుతో హుజూరాబాద్ ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టేందుకు కూడా అధికార పార్టీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అటు రాజకీయంగా ఈటలకు చెక్ పెట్టడానికి, ఇతర పార్టీల నాయకులని టీఆర్ఎస్‌లోకి తీసుకుంటున్నారు. అలాగే ఉద్యమ నేపథ్యం ఉన్న గెల్లుకే సీటు ఇచ్చారు.

ఇదే సమయంలో టీఆర్ఎస్ మరో వ్యూహంతో ముందుకొచ్చేలా కనిపిస్తోంది. అది గెల్లుని గెలిపిస్తే మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉందని గులాబీ పార్టీ ప్రచారంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈటలని మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆయన శాఖని కేసీఆర్ చూసుకుంటున్నారు. దీంతో గెల్లుకు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని గులాబీ పార్టీ అంతర్గతంగా హుజూరాబాద్‌లో ప్రచారం చేయొచ్చని తెలుస్తోంది. ఈటలని ఓడించడానికి ఇలాంటి వ్యూహంతో కూడా టీఆర్ఎస్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news