ప్రేమ అన్న మాటలోనే అదోలాంటి ఫీలింగ్ ఉంది. దాన్ని మాటల్లో చెప్పలేం. కేవలం అనుభవించాలంతే. అందుకే ప్రేమ గురించి తెలియాలంటే ప్రేమించడం తప్ప ఇంకో దారి లేదు. ఐతే ప్రేమ ఎన్నిసార్లు పుడుతుందనేది ఒక ప్రశ్న. కొంతమందేమో ప్రేమ ఒక్కసారే పుడుతుంది. ఒక్కరి మీదే పుడుతుంది అంటారు. కొందరేమో, ప్రేమ ఎవ్వరి మీదైనా ఎన్నిసార్లైనా పుట్టవచ్చు అని చెబుతారు. ప్రేమ ఎన్నిసార్లు పుట్టినా ఎంత మందిని ప్రేమించినా తొలిప్రేమ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది.
జీవితంలో ఎంతో మందిని ప్రేమించినా కూడా తొలిప్రేమ గుర్తులను మర్చిపోరు. తొలిప్రేమ కాలం నాటి అనుభవాలు అనుక్షణం వెంటాడుతూనే ఉంటాయి. ఎంతో మందిని ఎన్నెన్నిసార్లు ప్రేమించినా కూడా తొలిప్రేమ తాలూకూ తియ్యదనం కనిపించదెందుకు? అసలు తొలిప్రేమను మర్చిపోకపోవడానికి కారణాలేంటి? ఇక్కడ తెలుసుకుందాం.
మొదటిసారి ప్రేమలో పడ్డప్పుడు అత్యద్భుత అనుభవాన్ని అనుభవిస్తారు. ఎంతో ఎక్సైట్మెంట్ ఉంటుంది. చిన్నపాటి భయం ఉన్నా కూడా అమోఘమైన భావుకత్వం కనిపిస్తుంది. ఇలాంటి అనుభూతి మళ్ళీ మళ్ళీ రాదు.
మొదటి ప్రేమలో అమాయకత్వం ఉంటుంది. అది ప్రేమని మరింత పెంచుతుంది. ఆ అమాయకత్వం అవతలి వారిపై తీవ్రమైన ప్రేమను పెంచుతుంది.
తొలిప్రేమలో యవ్వనం కనిపిస్తుంది. మీ ప్రేమను గుర్తుచేసుకున్నప్పుడల్లా మీ యవ్వనం గుర్తొస్తూ ఉంటుంది. దాన్ని దాటివెళ్లబుద్ధి కాదు. అందుకే ఎక్కువ సార్లు తలచుకుంటూ ఉంటారు.
తొలిప్రేమ సమయంలో అన్నీ తొలిసారిగా అనుభవంలోకి వస్తాయి. మొదటిముద్దు, మొదటి సామీప్యం, మొదటి స్పర్శ మొదలగునవన్నీ శరీరంలో రకరకాల మార్పులను తీసుకువస్తాయి.
మొదటి ప్రేమ అకస్మాత్తుగా ఆగిపోతుంది. మీరు ప్రేమించినవారు పై చదువుల కోసం ఇతర దేశాలకి వెళ్ళడమో, కెరీర్ కారణాలు మొదలగు వాటివల్ల అకస్మాత్తుగా ప్రేమ ముగిసిపోతుంది.