తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ వేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. రాజకీయ ముఖచిత్రంలోకి కొత్త పార్టీలు వస్తుండటం, అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరికలు, ఈటల రాజీనామా తదితరాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలంగాణలో రాజకీయం బాగా రసవత్తరంగా మారిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఇక ఈటల రాజేందర్ రాజీనామాతో అధికార టీఆర్ఎస్ పార్టీలో చాలా మార్పులు జరిగాయి.
హుజురాబాద్‌లో ఎట్టి పరిస్థితులలో గులాబీ జెండా ఎగురవేయాలనుకున్న సీఎం కేసీఆర్ ఏకంగా ‘దళిత బంధు’ స్కీమ్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడే లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి నేతలును గులాబీ గూటికి చేర్చుకున్నాడు. కాగా, బీజేపీ నేత ఒకరు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎం కేసీఆర్‌ను సీఎం పదవి నుంచి తప్పించేందుకుగాను హరీశ్‌రావు ప్లాన్ చేశారని, ఇందుకుగాను బీజేపీ అగ్రనేత అమిత్ షాను కూడా కలిశారంటూ బీజేపీ నేత మేరుగు రాజు సంచలన ఆరోపణలు చేశారు.
పింక్ పార్టీలో తనకు 35 మంది ఎమ్మెల్యేల సపోర్టు ఉందని, వారంతా కూడా తననే సీఎం కావాలని కోరుకుంటున్నారని హరీశ్ అమిత్ షాకు చెప్పారని తెలిపారు. ఈ విషయాలకు సంబంధించిన ఆధారాలను తాను సరైన టైంలో మీడియాకు తెలుపుతానని పేర్కొన్నాడు. ఆనాడు హరీశ్ చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న వారిలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఉన్నారని పేర్కొన్నాడు. ఇప్పుడు కూడా హరీశ్ అదును కోసం చూస్తున్నాడని, టైం వస్తే దెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆరోపించింది. దాంతో ఈ విషయాలపై రాజకీయ వర్గాల్లో చర్చ షురూ అయింది. అయితే, ఈ విమర్శలకు పింక్ పార్టీ ట్రబుల్ షూటర్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎటువంటి బదులు ఇస్తారో చూడాలి మరి..