హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్ గెలుపు బాధ్యతలని తీసుకున్న దగ్గర నుంచి మంత్రి హరీష్ రావు దూకుడుగా పనిచేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం, పార్టీ పరంగా విపరీతంగా ఖర్చు పెట్టారు. హుజూరాబాద్‌లో ప్రజలని ఆకట్టుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో…అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాజకీయంగా కూడా హరీష్….తనదైన శైలిలో ముందుకెళుతున్నారు.
కాకపోతే గతంలో హరీష్ ఎలాంటి రాజకీయం చేసిన దానికి లాజిక్ ఉండేది…కానీ ఇప్పుడు ఈటలని ఓడించాలనే కంగారులో ఆ లాజిక్‌లు ఏమి ఉండటం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే హరీష్…ప్రతిరోజూ ఈటల టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. ఈటల సిఎం కావాలని ఆశపడ్డారని, తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశారని, తండ్రి లాంటి కేసిఆర్‌కి అన్యాయం చేశారని మాట్లాడుతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ రాజేందర్‌కు అన్ని అవకాశాలు ఇచ్చిందని.. సీఎం పదవి తప్ప ఆయన అన్ని పదవులు అనుభవించారని, ఈటలనే టీఆర్‌ఎస్‌కు అన్యాయం చేశారని, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు వ్యవహరించారని హరీష్ ఫైర్ అవుతున్నారు.
అయితే హరీష్‌కు ఈటల ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. హరీష్…కేసిఆర్‌ని మోసం చేసి సిఎం పీఠం గుంజుకోవలని చూశారని, అందుకే చాలా రోజులు కేసిఆర్, హరీష్‌ని దూరం పెట్టారని, తాను ఏనాడైనా సిఎం కావాలనుకున్నానా? కేవలం మనిషిగా గుర్తించాలని అడిగింది మనిద్దరమే కదా? అంటూ హరీష్‌ని అడిగారు.
కాకపోతే ఇక్కడ హరీష్ ఒక లాజిక్ మిస్ అవుతున్నట్లు ఉన్నారు. అసలు ఈటలపై భూ కబ్జా ఆరోపణలు చేసి ఆయన్ని మంత్రి పదవి నుంచి కేసిఆర్ తొలగించారు. ఆ తర్వాత ఆయన ఆత్మగౌరవం దెబ్బతినకూడదని టిఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చారు…అలాగే నైతిక విలువలు పాటిస్తూ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. అంటే ఇక్కడ టిఆర్‌ఎస్ కావాలనే ఈటలని బయటకు పంపిందని, పైగా పార్టీ ద్రోహం చేశారని అప్పుడు మాట్లాడలేదని, కేవలం భూ కబ్జా ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు ఆ భూ కబ్జా ఆరోపణలు ఏమయ్యాయో గానీ, పార్టీకి ద్రోహం చేశారని హరీష్ ఇప్పుడు లాజిక్ లేకుండా రాజకీయం చేస్తూ, ఈటలకు మరింత బెనిఫిట్ అయ్యేలా చేస్తున్నారని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.