ప్రస్తుతం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు వస్తున్న విషయం ఇది! వెనకా ముందూ చూసుకోకుండా ఆవేశపడటం – అభిమానుల్లోనూ, కార్యకర్తల్లోనూ ఆశలు రేపడం – ఆనాక చల్లబడటం – జనసైనికులను అయోమయంలో పాడేయడం… పవన్ పొలిటికల్ కెరీర్ లో ఇది రెగ్యులర్ అంశం!
పార్టీ పెట్టిన కొత్తలో పవన్ బలమైన వాదన వినిపించారు. పదవులు ముఖ్యంకాదని, అంతా అనుకునే రాజకీయాలు చేయడానికి తాను రాలేదని అన్నారు. ప్రశ్నించడానికి జనసేన పుట్టిందని తెలిపారు. కానీ.. చిత్రంగా అధికారంలో ఉన్నవారిని మానేసి, జగన్ ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. విచిత్రంగా.. టీడీపీతో జతకట్టారు. తానుకూడా సోకాల్డ్ రాజకీయ నాయకుడినే అనే క్లారిటీ ఇచ్చారు!
అనంతరం టీడీపీతో తెరముందు తెగతెంపులు చేసుకున్నారు! పాచిపోయిన లడ్డూలిచ్చిన బీజేపీతో దోస్తీ చేశారు. హస్తిన నేతలతో చట్టాపట్టాలేసుకు తిరిగారు! బీజేపీ హిందుత్వ విధానాలను అనుసరిస్తూ.. జగన్ సర్కార్ ని టార్గెట్ చేశారు. కానీ.. టీడీపీతో తెరవెనుక దోస్తీని కంటిన్యూచేస్తున్నట్లు వస్తున్న పుకార్లను తిప్పికొట్టడంలో విఫలమయ్యారు! మళ్లీ జనసైనికులు కంఫ్యూజన్ లో పడేశారు!
గతకొద్ది రోజులుగా జగన్ సర్కార్ పై యుద్దం ప్రకటిస్తున్నారు. జగన్ ను గద్దెదింపడమే తన లక్ష్యం అని.. ఆ లక్ష్యసాదనలో తగ్గేది లేదని చెప్పుకొచ్చారు. తాజా రాజమండ్రి సభలో సామాజికవర్గాల ప్రస్థావన తీసుకొచ్చారు. పరోక్షంగా బహుజనవాదాన్ని ఎత్తుకున్నారు. దీంతో బద్వేల్ లో సత్తాచాటుతారని అంతా భావించారు. జన సైనికులు రాజమండ్రి సభలో కనిపించిన కొత్త పవన్ పై ఆశలు పెంచుకున్నారు. చిత్రంగా బద్వేల్ లో పోటీనుంచి పవన్ తప్పుకున్నారు!
“ఇది పవన్ కు కొత్తేమీ కాదు” అనే మాటను తెరపైకి తెచ్చారు. తాను ఇంకా పాత పవన్ కల్యాణ్ నే అని నిరూపించేపనికి పూనుకున్నారు. ఆ సీటు ఏకగ్రీవం చేయాలని కావాలని కోరుకుంటున్నట్టు కూడా సెలవిచ్చారు. పాతమిత్రులు చంద్రబాబు – కొత్త మిత్రులు బీజేపీ నేతలను కూడా ఆ పనిచేయమని చెప్పడం మరిచారు! ఫలితంగా.. ఏకగ్రీవం అంటే జనసేన ఒక్కటే త్యాగం చేస్తే సరిపోదు, మిగతా పార్టీలన్నీ ఆ పని చేయాలనే విషయాన్ని మరిచారు!