దేశ వ్యాప్తంగా దిశ అత్యాచార ఘటన సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత విచారణలో భాగంగా సీన్ రిక్రియేట్ చేస్తున్న క్రమంలో నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు నిందితులు మరణించారు. ఈ ఘటనను పౌర సమాజం స్వాగతించింది. అయితే ఈ ఘటనలో చట్టాన్ని మీరి పోలీసులు ప్రవర్తించారనే వాదన.. ఎన్ కౌంటర్ ఫేక్ అనే వాదనలు కూడా వచ్చాయి.
అయితే ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్ట్ సిర్పూర్కర్ కమిషన్ ని నియమించింది. తాజాగా దిశ ఎన్ కౌంటర్ పై విచారణ పూర్తి చేసిన కమిషన్ సుప్రీం కోర్ట్కు నివేదికను సమర్పించింది. గత నెల 28 తేదీనే కమిషన్ నివేదికను సుప్రీం కోర్ట్ కు అందించినట్లు తెలుస్తోంది. దాదాపు 47 రోజుల పాటు విచారణ కొనసాగింది. 57 మంది వీడియో వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ నివేదికలతో పాటు ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్లను కూడా సమర్పించింది. ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసి సీల్డ్ కవర్ లో నివేదికలో సుప్రీం కోర్టుకు అందించింది.