అనుకోని ఘటనలు జరిగితే కొవ్వొత్తి వెలుగులు వస్తాయి..కానీ ఆ వెలుగులు ఎన్నాళ్లు..చీకట్లు తరిమే ప్రయత్నం చిరకాలం చేయాలంటే ఏం కావాలి? వాటికి వాటితో పాటు ఇంకొన్నింటికి సమాధానం ఈ కథనం. కేటీఆర్ (ఐటీ శాఖ మంత్రి) దత్తత కాలనీలో వెలుగులు. ఎవరో కాదు తీసుకువస్తున్నది ఓ సామాన్య మహిళ..ఆమె పేరు వాణి..ఆ సంస్థ పేరు విద్యాధరి..
చదువు ఆవశ్యకం.. వెలుగు ఆవశ్యకం..జీవితం నేర్పింది ఇదే! చిన్నారి చైత్ర లాంటి జీవితాలు ఛిద్రం కాకుండా ఉండేందుకు ఓ మాతృమూర్తి స్పందించారు.ఓ సామాన్య మహిళ తనవంతుగా ఆరేడు నెలలు సింగరేణి కాలనీ (చిన్నారి చైత్ర ఉన్నది ఇక్కడే, ఘటన జరిగిందీ ఇక్కడే) లో సర్వే చేసి బడిఈడు పిల్లలకు చదువుకునేందుకు,ముఖ్యంగా ఖాళీ వేళల్లో పక్కదోవలు పట్టకుండా ఉండేందుకు ఆమె చేసిన కృషి ఇప్పుడిప్పుడే ఫలితం ఇస్తోంది. కొందరు దాతలు కలిశారు ఇంకొందరు చేతులు కలిపితే చాలు మంచి ఫలితాలే వస్తాయి.. జీతే రహో చల్తే రహో !
చిన్నారి చైత్ర ఘటనను మరువలేం.భాగ్య నగరి చరిత్రలో అదొక చీకటి రోజు.అలాంటి రోజు మళ్లీ రాకూడదు.అలాంటి కీడు మళ్లీ మళ్లీ ఎదురు కాకూడదు.మద్యానికి బానిసైన తల్లిదండ్రులు ఎక్కడున్నా వారిని దార్లోకి తీసుకుని రావాల్సిన బాధ్యత కూడా చుట్టూ ఉన్నవారిదే! ఆ విధంగా కాకుండా ప్రేక్షక పాత్రకు మాత్రమే మనం పరిమితం అయి క్యాండిల్ ర్యాలీల పేరిట సందడి చేయడం అస్సలు భావ్యం కాదు. అందుకే చిన్నారి చైత్ర లాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే సామాజిక బాధ్యత అన్నది ప్రతి ఒక్కరికీ ఉండాలి.ఆ విధంగా మంచి ఫలితాలు వచ్చే వరకూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అందుకు తగ్గ ప్రాధాన్యాంశాలను ఎంపిక చేసుకుని మంచి సమాజ నిర్మాణానికి ప్రచార కాంక్ష లేని పనులకు ప్రాముఖ్యం ఇవ్వాలి.ఇప్పుడిదే చేస్తోంది విద్యాధరి అనే స్వచ్ఛంద సంస్థ.
ఈ సంస్థను నడుపుతున్న వాణి తన తరఫున సింగరేణి కాలనీ బిడ్డలు బాగా చదువుకుని బాధ్యత గల పౌరులు అయ్యేందుకు వీలుగా,అందుకు సహకరించేందుకు వీలుగా అక్కడ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేశారు.పది స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి దాదాపు వెయ్యి మంది పిల్లలు చదువుకునే విధంగా ఏర్పాటు చేశామని సంస్థ నిర్వాహకురాలు వాణి తెలిపారు. అదేవిధంగా వీరికి పుస్తకాలు,స్టడీ మెటీరియల్ కూడా అందించారు ఆమె. ఇప్పుడు మరో ఇరవైకి పైగా స్టడీ సెంటర్లను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని,దాతలు కోసం ఎదురు చూస్తున్నామని అంటున్నారామె.మంచి ప్రయత్నం మంచి ఫలితాలను అందుకుంటుంది. ఈ సమాజం తనని తాను తీర్చిదిద్దుకునే క్రమంలో కొన్ని తప్పుల నుంచి దిద్దుబాట పట్టే క్రమంలో ఇటువంటి సంస్థలే ఆదర్శం అవుతాయి.చిన్నారి చైత్రకు నివాళి ఇది. సిసలు నివాళి అని రాయాలి.
– రత్నకిశోర్ శంభుమహంతి
శ్రీకాకుళం దారుల నుంచి..