ఎడిట్ నోట్ : పాద‌యాత్ర‌కు అంతా సిద్ధ‌మేనా ! లోకేశ్

-

పాద‌యాత్ర చేస్తేనే అధికారం అన్న ఒక గొప్ప రాజ‌కీయ సూత్రం విజ‌య‌వంతంగా అమ‌లు అవుతోంది ఎప్ప‌టి నుంచో ! ఆ క్ర‌మంలో ఆ రోజు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎన్నో విజ‌యాలు అందుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో పాద‌యాత్ర అంటే అంత సులువు కాదు. అందుకు అధిష్టానం ఒప్పుకున్నా కార్య‌క‌ర్త‌లు ఒప్పుకున్నా ఆయ‌న‌తో న‌డిచే వాళ్లంద‌రూ ఒప్పుకోవాలి. న‌డ‌వ‌డం సుల‌వు అంద‌రినీ క‌లిపి ఉంచ‌డ‌మే క‌ష్టం.అస‌హ‌నం ఎంత ఉన్నా కూడా వెల్ల‌డిలోకి రాకుండా చూడ‌డం ఇంకా క‌ష్టం.ఆ రోజు ఇప్పుడున్నంత మీడియా లేదు.

nara lokesh

మీడియాలో వార్త‌లు రాక‌పోయినా పర్లేదు కానీ అనుకునేందుకు, సెల్ఫ్ ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్ ను చేప‌ట్టేందుకు సోష‌ల్ మీడియా కూడా పెద్ద‌గా వాడ‌కంలో లేదు. బ్లాగ్ క‌ల్చ‌ర్ కూడా పెద్ద‌గా గుర్తింపులో లేని రోజుల‌వి. అటువంటి రోజుల్లో వైఎస్సార్ పాద‌యాత్ర చేశారు. మండుటెండ‌ల్లో న‌డిచారు. పేద‌ల క‌ష్టాలు తెలుసుకుని చ‌లించిపోయారు. ఆడ బిడ్డ‌ల క‌ష్టాన్ని చూసి
చ‌లించిపోయారు. రైత‌న్న‌ల ఆత్మ‌హ‌త్య‌ల వెనుక అస‌లు కార‌ణాలు తెలుసుకుని క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్న బాధితులకు అండ‌గా ఉండేందుకు ఆ రోజే నిర్ణ‌యించుకుని అడుగులు వేశారు. ఆ స్థాయిలో ఆయ‌న ప‌నిచేశాక‌నే ఫ‌లితాలు వ‌చ్చాయి. ఓ విధంగా చెప్పాలంటే అది అనూహ్య స్థాయి. త‌రువాత ఆయ‌న బిడ్డ‌లు ష‌ర్మిల కానీ ఇప్ప‌టి ఆంధ్రావ‌ని వాకిట తిరుగులేని నేత పేరొందిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కానీ పాద‌యాత్ర‌లు చేప‌ట్టినా కూడా వైఎస్సార్ ది సిస‌లు చ‌రిత్ర.. ఆయ‌న బిడ్డ‌ల‌ది ఆ..చ‌రిత్ర‌కు కాస్త కొన‌సాగింపు.

తాజాగా చిన‌బాబు లోకేశ్ పాదయాత్ర‌కు సిద్ధం అవుతున్న నేప‌థ్యంలో ఇవాళ ఇవ‌న్నీ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఆయ‌న స్థాయిని పెంచేందుకు పాద‌యాత్ర ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, ముఖ్యంగా ఆయ‌న అనుచ‌రులు భావిస్తుండ‌డం విశేషం. నాయ‌కుడు అంటే జ‌నంలోనే ఉండాలి..ప్ర‌జ‌ల క‌న్నీళ్ల‌ను తుడ‌వాలి.. బాధ‌ల‌ను బాధ్య‌త‌లో భాగంగా విని ప‌రిష్క‌రించేందుకు తానేం చేస్తానో చెప్ప‌గ‌ల‌గాలి. ఆ విధంగా న‌మ్మ‌కం, విశ్వాసం క‌లిగిస్తేనే
బాధిత జ‌నం ఓ నాయ‌కుడి వెంట న‌డుస్తారు. ఆయ‌న ఒక‌వేళ ఉద్య‌మాల‌కు పిలుపు ఇస్తే పోరాడేందుకు సిద్ధం అవుతారు.
క‌నుక లోకేశ్ చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర తో మ‌రో కొత్త జీవితం ఆయ‌న అందుకుంటార‌నే ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news