మరోసారి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. తమిళనాడులో రూపాయికే 4 ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతున్న కమలాత్తాళ్ కు ఆయన ఇల్లు కట్టించి. తాను ఇచ్చిన మాటను నిలబెట్టకున్నారు. ఆమెకు ఇల్లు కట్టించి ఇస్తానని 2019లో తానిచ్చిన మాట ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా నేడు మాతృదినోత్సవం సందర్భంగా నూతనంగా నిర్మించిన గృహాన్ని కమలాత్తాళ్ కు అందించారు. కమలాత్తాళ్ స్వస్థలం తమిళనాడులోని వడివెలంపాలయం గ్రామం. ఆమె గత 37 ఏళ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా, పేదల కడుపు నింపడమే ధ్యేయంగా అత్యంత చవకగా ఇడ్లీలు అమ్ముతోంది.
2019లోనే ఈ ఇడ్లీ బామ్మ గురించి ఆనంద్ మహీంద్రా అందరికీ వెల్లడించారు. ఆమె కట్టెల పొయ్యిపై కష్టపడుతుండడంతో గ్యాస్ కొనిస్తానని మాటిచ్చారు. ఆపై ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడది చేసి చూపించారు. తాజాగా ఇంటి నిర్మాణ పనులు, కమలాత్తాళ్ నూతన గృహప్రవేశ దృశ్యాలతో కూడిన వీడియోను ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. మదర్స్ డే నాడు ఆ ఇంటిని ఇడ్లీ అమ్మకు ఇచ్చేలా ఎంతో కష్టపడి సకాలంలో పని పూర్తిచేసిన తమ బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆనంద్ పేర్కొన్నారు.